Friday 5 April 2019

మకర రాశిఫలములు వికారి నామ సంవత్సర రాశిఫలములు

Kanya rashi telugu year predictions
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు (బో, జ, జి)
శ్రవణం 4 పాదాలు (జు, జే, జో, ఖ)
ధనిష్టా 1, 2 పాదాలు (గ, గి)
ఈ వికారి నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు 11వ ఇంట, వృశ్చిక రాశిలో ఆతర్వాత నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, 12వ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 12వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత 1వ ఇంట, మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో 6వ ఇంట కేతువు 12వ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.

వృత్తి


ఈ సంవత్సరం మకర రాశి వారికి ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్ధం కొంత సామాన్యంగా ఉంటుంది. నవంబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగంలో మంచి ప్రగతి సాధిస్తారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయడమే కాకుండా మీ పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఈ సంవత్సరం రాహు గోచారం ఆరవ ఇంట్లో ఉండటం వలన అది ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీ సహోద్యోగులు నుంచి సహాయ సహకారాలు అందడమే కాకుండా, గతంలో మీకు చెడు చేయాలని చూసిన కొంతమంది మీ నుంచి దూరం అవుతారు. దాని కారణంగా మీకు ఉండే శత్రుభయం పూర్తిగా తొలగిపోతుంది. జనవరి వరకు శని గోచారం పన్నెండవ ఇంట ఉండటం వలన చేపట్టిన పనులు కొన్నిసార్లు ఆలస్యం అవటం లేదా బద్ధకంతో మీరు కావాలని ఆలస్యం చేయడం జరుగుతుంది. దానివలన మీకు రావలసిన పేరు రాకుండా పోయే ప్రమాదం ఉంది. బద్ధకానికి తావివ్వకుండా మీకు కేటాయించిన పనులను పూర్తి చేయడం వలన మీ పై ఉండే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ అనుకూలమైన మార్పు కానీ కావాలని కోరుకుంటున్న వారికి ఈ సంవత్సరం నవంబర్ లోపు వారు ఆశించిన ఫలితం దక్కుతుంది. గురు గోచారం లాభ స్థానంలో ఉండటం వలన ఎక్కువ శ్రమ లేకుండా చేపట్టిన పనులను మీ సహోద్యోగుల సహాయ సహకారాలతో పూర్తిచేయగలుగుతారు. మీ పై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చ కలుగుతారు. దీనివలన మీ పదోన్నతి విషయంలో ఉండే అడ్డంకులు తొలగిపోయి పదోన్నతి తొందరగా వస్తుంది. నవంబర్ తర్వాత గురు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన చేపట్టిన పనుల్లో అలసత్వం ఏర్పడడం తద్వారా పై అధికారుల దృష్టిలో మీ గురించి చెడు భావన కలగడం జరగవచ్చు. నవంబర్ తర్వాత ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నది ముఖ్యంగా మీకు ఇష్టం లేని ప్రదేశానికి లేదా మీరు కోరుకొని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదా మీకు ఇష్టం లేని వ్యక్తుల కింద పనిచేయాల్సి రావడం గానీ జరగవచ్చు. జనవరిలో శని జన్మరాశికి మారటం వలన కొంత అనుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగి పోయి ఉద్యోగంలో కొంత సానుకూలత ఏర్పడుతుంది. అయితే పని ఒత్తిడి విషయంలో మాత్రం పెద్దగా మార్పు ఉండదు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం నవంబర్ వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు రావడం అలాగే వ్యాపారం అభివృద్ధి జరగడంతో గతంలో మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే వ్యాపార అభివృద్ధి మీరు కోరుకున్న విధంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో సప్తమ స్థానంపై శని దృష్టి ఉండటం అలాగే గోచారం పన్నెండవ ఇంట ఉండటం వలన వ్యాపారం కొంత మందకొడిగా సాగుతోంది. ఇప్పుడు సలహాల కారణంగా పెట్టిన పెట్టుబడులు కొంత నష్టాన్ని ఇస్తాయి. అయితే రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన నష్టాల శాతం తగ్గడమే కాకుండా గతంలో రావలసిన డబ్బులు అంది ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. కళాకారులు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి కలిగినవారు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో అనుకున్నదానికంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కానీ కాని సంపాదిస్తారు. వారి కళకు ప్రతిభకు ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి గుర్తింపు కలగడమే కాకుండా ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు అహంకారాన్ని కానీ గర్వం కానీ లోనయి కొన్ని మంచి అవకాశాలను వదులుకోవచ్చు కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. ద్వితీయార్థంలో గురువు మరియు శని గోచారము సామాన్యంగా ఉండటం వలన అవకాశాల కొరకు కొంత వలసి వస్తుంది. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నం చేసిన తర్వాత మంచి అవకాశాలను అందుకోగలుగుతారు.

కుటుంబం


ఈ సంవత్సరం కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన కుటుంబంలో ఆహ్లాద కరమైన వాతావరణం నెలకొంటుంది. గతంలో కుటుంబ సభ్యుల మధ్య లో ఉన్న అపోహలు తొలగిపోయాయి ప్రేమాభిమానాలు పెరుగుతాయి. నవంబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ మిత్రుల నుంచి మరియు బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుకుంటారు. మీరు చేపట్టిన కార్యక్రమాలకు వారి అండదండలు ఉండటం వలన ఎక్కువ శ్రమ లేకుండా పూర్తి చేయగలుగుతారు. వివాహం గురించి గానీ సంతానం గురించి కానీ ఎదురుచూస్తున్న వారికి లాభ స్థానంలో గురువు గోచారం అనుకున్న ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం నవంబర్ లోపు వారి కోరిక తీరే అవకాశం ఉంది. నవంబర్ నుంచి గురు గోచారం పన్నెండవ ఇంట ఉండటం అలాగే జనవరి నుంచి శని గోచారం జన్మ స్థానంలో ఉండటం వలన మీ జీవిత భాగస్వామి తో మనస్పర్థలు ఏర్పడటం కానీ లేదా మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ జరగవచ్చు. అయితే రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఏ సమస్య అయినా ఎక్కువ కాలం ఉండక తొందరగానే తగ్గుతుంది. జన్మల శని గోచారం కారణంగా మీ ప్రవర్తన వల్ల ఇతరులు బాధ పడకుండా చూసుకోండి ఎందుకంటే శని బద్దకాన్ని వాయిదా వేసే స్వభావాన్ని ఇస్తాడు ద్వారా మీ జీవిత భాగస్వామికి ఎదురవుతుంది. కాబట్టి వీలైనంతవరకు అలసత్వానికి కానీ వాయిదా వేసే స్వభావానికి కానీ దూరంగా ఉండటం మంచిది

ఆర్థిక స్థితి


ఈ సంవత్సరం ప్రథమార్థం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా నవంబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆదాయం పెరగడమే కాకుండా రావలసిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. స్థిరాస్తుల్లో కానీ, షేర్ మార్కెట్ లో కానీ మీరు పెట్టిన డబ్బులు మంచి లాభాలను ఇస్తాయి. రాహువు గోచరము కూడా ఆరవ ఇంట అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. గతంలో మీరు చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తీర్చుకోగలుగుతారు. స్థిర చరాస్తుల కొనుగోలు కూడా ఈ సంవత్సరం నవంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. నవంబర్ తర్వాత పెట్టుబడులకు అంతగా అనుకూలంగా ఉండదు. నవంబర్ లో గురువు పన్నెండవ ఇంటికి రావటం అలాగే జనవరిలో శని జన్మస్థానానికి రావటం వలన ఆర్థికంగా అంత సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడి నుంచి గతంలో మాదిరిగా లాభాలు రాకపోవడం వలన కొంత ఇబ్బందికి లోనవుతారు. అయితే రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. నవంబర్ తర్వాత తొందరపడి పెట్టకుండా మరి తప్పనిసరి అయితే మాత్రమే పెట్టుబడి పెట్టేలా చూసుకోండి.

ఆరోగ్యం


మకర రాశి వారికి ఆరోగ్యపరంగా ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది మరియు ద్వితీయార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. గురువు నవంబర్ 5వరకు నమస్కారాలు సంచరిస్తాడు కాబట్టి ఆరోగ్య విషయంలో సమస్యలు ఉండవు అలాగే రాహు గోచారం సంవత్సరమంతా ఆరవ ఇంట అనుకూలంగా ఉంటుంది కాబట్టి అన్న ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. నవంబర్ నుంచి గురువు పన్నెండవ ఇంట సంచరించడం జనవరిలో శని జన్మ రాశి పై సంచరించడం వలన ఆరోగ్యంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ సమయంలో ఎముకలు ఊపిరితిత్తులు కాలేయ సంబంధ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. అయితే రాహు గోచారం కొంత అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం మిమ్మల్ని బాధించవు. అంతేకాకుండా అధిక శ్రమ కారణంగా మానసికంగా కొంత ఒత్తిడికి లోనవడం అలాగే సయాటికా ( బ్యాక్ పెయిన్) తదితర ఆరోగ్య సమస్యలు రావటం సంభవించవచ్చు. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవడం అలాగే సరైన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

చదువు


విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. నవంబర్ వరకు గురువు లాభ స్థానంలో ఉండటం వలన చదువులో మంచి ఏకాగ్రత మరియు ఆసక్తి పెరగడమే కాకుండా పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా గతంలో ఉన్న నిరాసక్తత కానీ బద్ధకం కాని తగ్గుతాయి. అంతేకాకుండా మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం లభిస్తుంది. అలాగే విదేశాల్లో చదువుకోవాలంటే ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉంటాయి. నవంబర్ నుంచి గురు గోచారం పన్నెండవ ఇంటికి వచ్చినప్పటికీ చతుర్ధ స్థానం పై దృష్టి ఉండటం వలన విద్యా విషయాలలో అనుకూలంగానే ఉంటుంది. అయితే జనవరి నుంచి శని గోచారం జన్మ రాశిలో ఉంటుంది కాబట్టి కొంచెం శ్రమ ఎక్కువ అవడం అలాగే బద్ధకం పెరగడం జరగవచ్చు. చదువు విషయంలో వాయిదా వేసే స్వభావాన్ని అలాగే నిర్లక్ష్యాన్ని వదిలి పెడితే అనుకూల ఫలితాలను పొందుతారు.

పరిహారాలు


ఈ సంవత్సరం మీరు ప్రధానంగా శనికి గురువుకు మరియు కేతువుకు పరిహారాలు చేయాల్సి ఉంటుంది. సంవత్సరమంతా శని అనుకూలంగా ఉండకపోవడం కొన్ని ఆరోగ్య సమస్యలు అలాగే వృత్తి పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి జపం కానీ స్తోత్రం కానీ లేదా హనుమాన్ చాలీసా పారాయణం లేదా ఆంజనేయ స్వామి ముందు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. నవంబర్ నుంచి గురువు పన్నెండవ ఇంట సంచరిస్తాడు కాబట్టి ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురు జపం కానీ గురు స్తోత్ర పారాయణం కానీ లేదా గురు చరిత్ర పారాయణం కానీ చేయటం మంచిది. సంవత్సరం అంతా కేతువు పన్నెండవ ఇంట సంచరిస్తాడు కాబట్టి కేతు మంత్ర జపం కానీ కేతు గ్రహ స్తోత్ర పారాయణం కానీ లేదా గణపతి స్తోత్ర పారాయణం కానీ చేయటం మంచిది. దీనివలన ఆయా గ్రహాలు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గి ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది.

No comments:

Post a Comment