Friday 2 June 2017

పంచాంగం

పంచాంగము అనగా ఐదు అంగములు కలది.

 అవి 1. తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4. యోగము, 5. కరణము.
ఆయనములు, పక్షములు
పంచాంగములు : 5
ఋతువులు : 6
వారములు : 7
దిక్కులు : 8
నవగ్రహములు 9
కరణములు : 11
మాసములు : 12
1. తిధి: ప్రతి రోజు సూర్యుడు 1అంశ (1డిగ్రీ) చంద్రుడు 13 అంశలు ముందుకు నడుస్తారు. అంటే వారిరువురి భ్రమణములోగల అంతరము 12డిగ్రీలు. (సూర్యుని భ్రమణమును సాపేక్ష భ్రమణము అంటారు. నిజానికి తిరిగేది భూమి. కాని మనము భూమిపై నిలబడి ఖగోళమును గమనించెదము కావున సూర్యునిది సాపేక్ష భ్రమణము.) ఈ 12 డిగ్రీల అంతరమును తిధి అంటారు.
మొదటి రోజు 12 డిగ్రీలు ఐతే రెండవ రోజు 24 డిగ్రీలు ఇట్లు 180 డిగ్రీలు చంద్రుడు సుర్యునినుండి జరిగినపుడు పౌర్ణమి, తిరిగి సూర్యుని చేరినపుడు (360 డిగ్రీలు లేక ౦ డిగ్రీ) వరకు కృష్ణ పక్షమని ఈ చంద్రయానమునంటారు. ఒక సౌర దినము = 0.9483 చంద్ర తిధి. ఈ విధంగా ఒక చంద్రమానమునకు 29.53 రోజులుంటాయి.
2. వారము: “అర్క శుక్ర బుధశ్చంద్రః మందో జీవ కుజః పుమాన్ స్వార్ధ ద్వి ఘటికా హోరాః ఇత్యే తత్ హోర లక్షణం”
అన్నది జ్యోతిష శాస్త్రము. 2½ ఘడియల కాలము = 1హోర(hour). మొదటి హోర అర్క అంటే సూర్యుడు అంటే ఆదిత్యుడు. మొదటి హోరతో మొదలయ్యే రోజు కావున మొదటి వారము ఆదివారమైనది. ఒక రోజుకు 24 హోరలు. అర్క తో మొదలుపెట్టి ఎంచితే 24 హోరల తో ఆ దినము పుర్తియౌతుంది. 25 వ హోర చంద్ర హోర అంటే సోమవారము. ఈ ప్రకారముగా వరుసగా 7 వారాలు వస్తాయి. మన హోర నే పాశ్చాత్యులు hour గ ఉచ్చరించినారు. ఈ వారముల క్రమము ఈ విధముగా ఏర్పడినదని పాశ్చాత్యుల కెరుకలేదు. కాని ఈ వారముల క్రమమును యధా తధముగా తమ భాషలోనికి పేర్లను గూడా తర్జుమా చేసుకొని వాడుకొనుచున్నారు.
౩. నక్షత్రము: సాపేక్ష సౌర గమనమునకు ఒక ఏడాది కాలము పడితే, ఆ పథంలో ఆయనకు 12 మజితీలను గుర్తించి(ఈ
మజితీలను రాశులు అంటారు) ఆయన ప్రయాణాన్ని 27ప్రాంతాలు (నక్షత్రాలు) చుట్టునట్లు విభజించినారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు. 4+4+1 పాదము కలిస్తే ఒక రాశి. ౩వ నక్షత్రములోని మిగిలిన ౩ పాదములు నాల్గవ నక్షత్రములోని 4 పాదములు 5 వ నక్షత్రములోని 2 పాదములు కలిస్తే 2 వ రాశి. అంటే (౩+4+2=9) ఇది రెండవ రాశి. ఇట్లు 9 పాదములతో ప్రతి రాశి ఏర్పడుతుంది. 12*9=108 అంటే 27 నక్షత్రములలోని 4+4 .. .. .. పాదములను కలిపితే 27*4=108 పాదములగును. మానవుని పేర్లు ఈ 108 పాదములలో (ఆడ గాని, మగ గాని) ఏదో ఒక దానికి చెందును గాన అందరు సుఖంగా ఉండాలనే అష్ట్తోతర శత నామార్చన (108 పేర్లు) దేవునికి చేస్తారు. నక్షత్రముల పేర్లు రాశుల పేర్లు ఈ క్రింద పొందు పరచబడినవి
1.అశ్వని, 2.భరణి, ౩.కృత్తిక, 4.రోహిణి, 5.మృగశిర, 6.ఆర్ద్ర, 7.పునర్వసు, 8.పుష్యమి, 9.ఆశ్లేష, 10.మఖ, 11.పుబ్బ, 12.ఉత్తర, 13.హస్త, 14.చిత్త, 15.స్వాతి, 16.విశాఖ, 17.అనురాధ, 18.జేష్ఠ, 19.మూల, 20.పూర్వాషాఢ, 21.ఉత్తరాషాఢ, 22.శ్రవణం, 23.ధనిష్ఠ, 24.శతభిషం, 25.పూర్వాభాద్ర, 26.ఉత్తరాభాద్ర, 27.రేవతి.
12 రాశుల పేర్లు : 1.మేషం(Aries), 2.వృషభం(Taurus), 3.మిథునం(Jamini), 4.కర్కాటకం(Cancer), 5.సింహం(Leo), 6.కన్య(Virgo), 7.తుల(Libra), 8.వృశ్చికం(Scorpio), 9.ధనుస్సు(Sagitarius), 10.మకరం(Capricorn), 11.కుంభం(Acquarious), 12.మీనం(Pisces). ఈ సంస్కృత రాశుల పేర్లకు లాటిన్ ప్రతి నామాలు బ్రాకెట్లో ఇవ్వబడినవి. గ్రీకు, బాబిలోనియన్ ఇత్యాది భాషలలో కుడా రాశులకు వారు వారుపయోగించిన పేర్లు ఇంచుమించుగా ఇవే సంస్కృతార్ధములు కలిగియున్నవి.
4.యోగము: యోగమంటే కలయిక. దైనిక చంద్ర గతి, సాపేక్ష సూర్య గతి కలిపితే (13.20’) యోగమంటారు. ఈ యోగములు 27. అవి: 1.విష్కంభము, 2.ప్రీతి, 3.ఆయుష్మాన్, 4.సౌభాగ్య, 5.శోభన, 6.అతిగండ, 7.సుకర్మ , 8.ధృతి, 9.శూల, 10.గంధ, 11.వృద్ధి,12.ధృవ, 13.వ్యాఘాత, 14.హర్షణ, 15.వజ, 16.సిద్ధి, 17.వ్యతిపాత, 18వరియన్ (వరిష్ట), 19.పరిఘ, 20.శివ, 21.సిద్ధ, 22.సాధ్య, 23.శుభ, 24.శుక్ల, 25.బ్రహ్మ, 26.ఇంద్ర, 27.నైద్రుతి. ఈ యోగము ప్రభావము మానవ శరీరము ఆరోగ్యముపైనుం టంది.
5.కరణము: చంద్రుడు రోజుకు 12 డిగ్రీల వంతున సుర్యునినుండి దూరమౌతూ వస్తాడు. పాడ్యమికి 12 దిగ్రీలయితే విదియకు 24 డిగ్రీలు ఆ ప్రకారంగా 180 డిగ్రీలకు పున్నమి, 360(౦) డిగ్రీలకు అమావాస్య అని తెలుసుకొన్నాము. అర్ధ తిధిని కరణము అంటారు (అంటే 12/2=6) అంటే ఏ అర్ధ తిధియైన 6 చేత నిశ్శేషముగా భాగింపబడుతుంది. ఈ కరణములు 11 అవి: 1.భవ, 2.బాలవ, 3.కౌలవ, 4.తైతుల, 5.ఖర జి, 6.వణిజి,7.విష్టి, 8.చతుష్పద, 93శకుని, 10.నగ, 11.కింస్తుఘ్నము. మొదటి 7 ఒక చంద్ర మాసములో 8 మార్లు వస్తాయి. అంటే 28 రోజులు. చివరి 4 కరణములు వరుసగాను స్థిరముగాను వస్తాయి. సూర్య చంద్ర భూ చలనములను ఇంత నిశితముగా పరిశీలించి గ్రహచారములనధ్యయనముచేసి భూమి పై వాని ప్రభావమును గూర్చి తెలిపినదీప్రపంచములో ఈ దేశము తప్ప వేరు దేశము లేదంటే అతిశయోక్తి కాదు.
పంచ అంగముల తరువాత మాసములను గూర్చి ముచ్చటిద్దాము. చంద్రుడు తన గమనమున పౌర్ణమి రోజు ఏ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నాడో ఆ నక్షత్రము పేరుతో ఆ మాసము ఏర్పడింది. అంటే పున్నమి రోజున చిత్ర నక్షత్రము వద్దకొస్తే చైత్ర మాసము, విశాఖ నక్షత్రము వద్దకొస్తే వైశాఖ మాసము ఆ ప్రకారంగా 12 మాసములు ఏర్పడినవి కాని నిరర్ధకమైన పేర్లను ఉపయోగించలేదు. ఈ 12 మాసముల పేర్లు ఈ దిగువన ఇవ్వబడినవి
1.చైత్రము, 2.వైశాఖము, 3.జ్యేష్టము, 4.ఆషాఢము, 5.శ్రావణము, 6.భాద్రపదము, 7.ఆశ్వయుజము, 8.కార్తీకము, 9.మార్గశిరము, 10.పుష్యము, 11.మాఘము, 12.పాల్గుణము

విజయాలకి భక్తి మార్గాలు



సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం.

1. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి.

2. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు "కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందట.

3. ఇక మంచి విద్య రావాలన్నా, చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ " హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి. అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి.

4. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు " విష్ణు సహస్రనామం, లలిలా సహస్ర నామం పారాయణ చేయాలిట.

5. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు "గోపాల స్తోత్రం " చదివితే మంచిదట. అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు.

6. ఇక వివాహానికి "లక్ష్మీ అష్టోత్తర పారాయణం" చెయ్యాలి. మంచి సంబంధం దొరికి, పనులన్నీ చక్కగా జరగాలని,పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట.

7. ఋణబాధలు ఇబ్బంది పెడుతుంటే రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలిట. అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారుట.

8. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతాయట

జాతక దోష నివారణ పద్ధతులు



భూమి మీదున్న ప్రతి మానవునికి దేవ ఋణము, పితృ ఋణము అనే రెండు ఋణములు ఉంటాయి. అవి తీర్చుకోవాల్సిందే. కృతఘ్నతా దోషముతో మళ్లీ మళ్ళీ జన్మలెత్తడం, లేదా ఇంటిలో భూత ప్రేత పిశాచాల భయం, అకాల మరణాలు వంటి.. కఠిన సమస్యలతో సతమతమవటం జరుగుతూనే ఉంటుంది. కనుక ముందు ఈ ఋణములు తీర్చుకోవాలి.

దేవ, పితృ యజ్ఞాలు ప్రతివారు ఆచరించాల్సిన నిత్య కర్మలు. ఆ పితరులే లేకపోతే.. ఈ జీవితం శరీరం ఎక్కడిది?! కనుక తప్పక వారిని అర్చించాలి. వారికి ఆహారాన్ని స్వధా దేవి చేకూరుస్తుంది. 'స్వర్గం లోకం దధాతి యజమానస్యేతి స్వధా' అనగా పితృ యజ్ఞములు చేయువారికి ఉత్తమ స్థితులు, చేయనివారికి అధోగతులని భావం. మేము జ్ఞానులైపోయాము బదరీ క్షేత్రంలో పిండప్రదానం చేశాము, ఇక తామేమి చేయనక్కరలేదని పితృ యజ్ఞములు మానేస్తే మహా పాపమును పొందుతారని చెప్పబడుతోంది. జీవం ఉన్నంతవరకు.. హేతువైన పితృ దేవతలను నిత్యం స్మరించుకోవాలి.
సమస్య వచ్చినప్పుడే, పండగ వచ్చినప్పుడే దేవతలు గుర్తొస్తారనే విషయం చాలా మందిలో కనిపిస్తున్న వాస్తవం. పితరులకు భక్తి విశ్వాసాలతో ప్రతి ఏటా పితృ కార్యాన్ని ఆచరించినప్పటికీ... ఆయా కుటుంబాల వారు సుఖ శాంతులకు దూరంగానే ఉన్నారు. దీనికి కారణమేమిటనే ప్రశ్న తెరపైకి రావవచ్చు. నిజమే మరి.. స్వధా దేవిని కేవలం పితృ కార్యాలనాడే తలుచుకుంటారే తప్ప మిగిలిన రోజులలో మచ్చుకైనా గుర్తుచేసుకోరు. కేవలం సంవత్సరానికి ఒక రోజున వచ్చే పితృ కార్యం ఆచరించి చేతులు దులుపుకొన్నంత మాత్రాన లాభం లేదు, పితృతిధి రోజునే పితృ కార్యం ఆచరించిననూ స్వధా దేవిని ప్రార్ధించటం లేదు. కేవలం ఆనాడు.. ఆ కార్యాన్ని పూర్తి చేయటానికి స్వధా దేవిని ఒక దూతగానే వాడుకున్నాం తప్ప ఆ తల్లి అనుగ్రహం నిత్యం ఉండాలని, చాలా మంది గమనించరు.

స్వాహా దేవికి 16 నామలున్నట్లుగానే, స్వధా దేవికి కూడా 8 నామాలున్నవి. పితృప్రాణతుల్యా, యజప్రీతికరా, యజదేవతారూపిణి, శ్రాద్ధాధిష్టాతృదేవీ, శ్రాద్ధఫలప్రదా, ఆత్మ మానసకన్యా, పితృదృష్టిప్రదా, కృష్ణవక్షస్థలా అనే 8 నామాలు. ఈ స్వధా దేవినే పురాణములలో గోలోక వాసినిగా ఉన్న కృష్ణవక్షస్థలా అనికూడా చెప్పబడింది. ఈ 8 నామాలతో ఉన్న స్వధా దేవిని ప్రత్యేక పద్ధతులలో అర్చించాలి. కనుక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని మహా పుణ్యవంతమైన నామాలలో ఉన్న స్వాహా, స్వధా దేవతలను అర్చించటానికి కూడా ప్రత్యేకమైన రోజులు అవసరం. ఈ స్వాహా, స్వధా దేవతలను శాస్త్రీయ పద్దతిలో అర్చిస్తేనే, పూర్ణ ఫలాలను పొందగలుగుతారు.
ప్రతి ఒక్కరు దేవ యజ్ఞమును, పితృ యజ్ఞమును చేయాలి. దేవ యజ్ఞమును చేసినప్పుడు స్వాహాకారం, పితృయజ్ఞం చేసినప్పుడు స్వధాకారం ఉండును. ఈ రెండు శక్తులు వాక్కునకు మూలమైన అగ్నికి సంబంధించిన శక్తులుగా వర్ణింపబడినవి. ఈ విశ్వంలో దేవతలకి, పితృ దేవతలకి స్థానములున్నవి. వీరిరువురిని పూజించుట నిత్య కర్మలలో విధింపబడినది. భారతీయ యజ్ఞ విజ్ఞానంలో అనేక విషయములున్నవి. యజ్ఞాజ్ఞిలో సరియైన ప్రేరణతోనే స్వాహా, స్వధా శబ్దములు ఉండాలి. వాటి వల్లనే దేవతలు, పితృదేవతలు తృప్తి చెందుతారు.

పితృ కార్యములు ఆచరించునప్పుడు3 విధములైన దేవతలుగా చెప్పబడును. అవి వసు, రుద్ర, ఆదిత్య రూపమైన దేవతలు. అనగా అగ్ని, వాయు, సూర్యులలో దాగి ఉన్న పితృ శక్తి వసు, రుద్ర, ఆదిత్యుల రూపములుగా వ్యవహరింపబడుతున్నవి. ఈ 3 రూపములలో ఉన్నవారికి.. కర్త అయిన వ్యక్తి తన భావమును విన్నవించుకొనుటకు ఈ స్వధా దేవియే శరణ్యం. అగ్ని, వాయు, సూర్యుల ధారణా శక్తిని స్వధా అంటారు. ఇది వేదము చెప్పిన స్పష్టత. ఈ దేహములోనే కాక దేహానంతరము కూడా నడుపు శక్తి స్వధా దేవి. పితృ రూపములో జీవులు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో.. ఇక్కడ ఉన్నవారికి తెలియదు. కానీ ఆ పితృదేవతలను చేరుటకు మానవుని కర్మకు తగినటువంటి ఫలమును అందించుట ఒక్క స్వధా దేవికే సాధ్యం.

నైవేద్యం
ఎవరింట్లో అయితే పితృశాపం ఉంటుందో, ఎవరింట్లో అయితే పెద్దల కార్యాలను సరిగ్గా చేసి ఉండరో, ఎవరింట్లో అయితే అకాల మరణాలు ఎక్కువుగా సంభవిస్తూ ఉంటాయో, ఎవరింట్లో అయితే పెద్దల కలలోకి వస్తుంటారో, ఎవరింట్లో అయితే దెయ్యం, భూతం, పిశాచాల సమస్యలు ఉంటాయో అటువంటివారు దేవునికి నువ్వుల అన్నం లేదా నువ్వుల పొడితో చిత్రఅన్నని నైవేద్యంగా ఉంచి ప్రసాదంగా పంచాలి అలా చేస్తే వంశంలో, ఇంట్లో ఉన్న పితృ దేవతలా శాపాలు తొలగిపోతాయి. దేన్నీ చేసి మహాలయ అమావాస్య రోజు పెద్దల కార్యాలను చేస్తే అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.