Friday 6 April 2018

మీన రాశిఫలములు

మీన రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Kanya rashi telugu year predictions
పూర్వాభాద్ర 4వ పాదం (ది)
ఉత్తరాభాద్ర 4 పాదాలు (దు, శం, ఝ, థ)
రేవతి 4 పాదాలు (దే, దో, చ, చి)
ఈ సంవత్సరం మీన రాశి వారికి గురువు అక్టోబర్ వరకు అష్టమ స్థానంలో, తుల రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత వృశ్చిక రాశిలో, భాగ్యస్థానంలో సంచరిస్తాడు. శని సంవత్సరమంతా పదవ ఇంట ధనూ రాశిలో సంచరిస్తాడు. రాహువు కర్కాటక రాశిలో పంచమ భావంలో, కేతువు మకర రాశిలో లాభ స్థానంలో సంచరిస్తాడు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ అక్టోబర్ నుంచి మాత్రం మీకు చాల అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఆర్థిక సమస్యలు, ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ద్వితీయార్థంలో సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. నూతన గృహ, వాహనాదులు కొనుగోలు చేస్తారు. గత సంవత్సర కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగి పోతాయి

ఆరోగ్యం

ఈ సంవత్సరం అక్టోబర్ వరకు ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. తరచూ ఏదో ఒక అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. కాలేయం, మూత్రపిండాలు, జననేన్ద్రియలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా బాధించే అవకాశమున్నది. అయితే మిగతా గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చినా అవి ఎక్కువ కాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అక్టోబ నుంచి గురు గోచారం కూడా అనుకూలంగా మారటంతో ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. మిగతా సంవత్సరమంతా ఆరోగ్య విషయంలో పెద్దగ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు,

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. పదవ ఇంట శని గోచారం ఉద్యోగంలో మంచి మార్పులను, గుర్తింపును ఇస్తుంది. అయితే అక్టోబర్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండక పోవటం వలన ఉద్యోగంలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. అకస్మాత్తుగా ఉద్యోగం మారాల్సి రావటం కానీ, అవమానాలు ఎదుర్కోవాల్సి రావటం కానీ జరుగుతుంది. మీ సహోద్యోగులు కానీ, మీ పై అధికారులు కానీ మిమ్మల్ని తమ మాటలతో లేదా ప్రవర్తనలో ఇబ్బంది పెట్టె అవకాశమున్నది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించక ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొంత ఇబ్బందిని ఎదుర్కుంటారు. అక్టోబర్ లో గురువు మారాక మీది పై చేయి అవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అవసరాన్ని, ప్రతిభను మీ పై అధికారులు గుర్తిస్తారు. ఉద్యోగంలో మంచి ప్రగతి సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఎదురు చూస్తున్నవారు ద్వితీయార్థంలో అనుకూల ఫలితాన్ని పొందుతారు. శని గోచారం పదవ ఇంట ఉండటం వలన వృత్తిలో మీ ప్రతిభను చూపించుకునే అవకాశాలు చాల వస్తాయి. అవి భవిష్యత్తులో మీ అభివృద్ధికి తోడ్పడేలా ఉంటాయి.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్థం మాత్రం చాల అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో పెట్టిన పెట్టుబడులకు సరైన లాభాలు రాక కొంత ఇబ్బందికి గురవుతారు. మీరు నమ్మిన వ్యక్తులే మీకు చెడు చేయాలనీ చూడటం కానీ, మిమ్మల్ని అవమానించాలని కానీ చూస్తారు. అలాగే నమ్మి ఇచ్చిన డబ్బులు మోసపోయే అవకాశముంటుంది కాబట్టి డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులు కానీ, కొత్త వ్యాపారం ప్రారంభం చేయటం కానీ అక్టోబర్ వరకు అంతగా అనుకూలించదు. అక్టోబర్ తర్వాత నుంచి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభం అవుతాయి. రావు అనుకున్న డబ్బులు తిరిగి వస్తాయి.
ఆర్థికంగా ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావటం, ఆరోగ్య సమస్యలకు, కుటుంబం కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావటం వలన ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. ముందు వెనక చూడక ఖర్చు చేయటం తగ్గించటం మంచిది. అక్టోబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెట్టిన పెట్టుబడులకు మంచి ఫలితం వస్తుంది. నూతన గృహ యోగం కానీ, వాహన యోగం కానీ అక్టోబర్ తర్వాత ఉంటుంది.

కుటుంబం

ఈ సంవత్సరం కుటుంబ జీవితం ప్రథమార్థం కొంత సామాన్యంగా ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామికి కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశమున్నది. దాని కారణంగా కొంత ఆందోళనకు గురవుతారు. అయితే సమస్యలు వచ్చినప్పటికీ వాటి వలన మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు, నమ్మకం పెరుగుతాయి . మీ తల్లిదండ్రుల నుంచి మీకు సాయం అందుతుంది, అలాగే వారికి గర్వం కలిగించే పనులు ద్వితీయార్థంలో మీరు చేస్తారు. ఇంట్లో వివాహం, కానీ ఇతర శుభకార్యాలు కానీ జరిగే అవకాశమున్నది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి మీ జీవితంలో చాల సమస్యలు తొలగి పోయే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో చదివిన చదువుకు తగిన ఫలితం రాకపోవటంతో కొంత నిరాశకు, నిరుత్సాహానికి గురవుతారు. చదువు మీద ఆసక్తి తగ్గటం కానీ, ఇతర విషయాల మీద ఆసక్తి పెరగటం కానీ జరుగుతుంది. అక్టోబర్ నుంచి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. చదువు మీద శ్రద్ధ, ఏకాగ్రత పెరగటమే కాకుండా చదువు విషయంలో ఉన్న ఆటంకాలు తొలగి పోతాయి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితం వస్తుంది.

పరిహారాలు

ఈ సంవత్సరం ప్రధానంగా గురువుకు, రాహువుకు పరిహారాలు చేయటం మంచిది. అక్టోబర్ వరకు గురువు అనుకూలంగా ఉండదు కాబట్టి గురు స్తోత్ర పారాయణం కానీ, గురు మంత్రం జపం చేయటం కానీ మంచిది. అలాగే పంచమంలో రాహువు విద్యలో ఆటంకాలు కల్పిస్తాడు కాబట్టి రాహు పూజ కానీ జపం కానీ చేయటం మంచిది. లేదా ప్రతి రోజు దుర్గ స్తోత్ర పారాయణం చేయటం మంచిది.

కుంభ రాశిఫలములు

కుంభ రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.
Kanya rashi telugu year predictions
ధనిష్టా 3, 4 పాదాలు (గు, గె)
శతభిషం 4 పాదాలు (గొ, స, సి, సు)
పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు (సె, సో, ద)
ఈ సంవత్సరం కుంభ రాశి వారికి అక్టోబర్ వరకు గురువు తొమ్మిదవ ఇంట ఉంటాడు. ఆ తర్వాత పడవ ఇంట సంచరిస్తాడు. శని సంవత్సరమంతా లాభ స్థానంలో, ధనూ రాశిలో సంచరిస్తాడు. రాహువు కర్కాటక రాశిలో, ఆరవ ఇంట, కేతువు మకర రాశిలో పన్నెండవ ఇంట వత్సరాంతం సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ విలంబ (విలంబి) నామ సంవత్సరం మీకు చాల అనుకూలంగా, శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి, ఆర్థిక స్థితి మెరుగుపడటం, సమస్యలు తొలగి పోవటం మొదలైన శుభఫలితాలు ఉంటాయి. అయితే పన్నెండవ ఇంట కేతు గోచారం కారణంగా ప్రతి దానికి భయపడటం, ఏ పని చేయాలన్న ఎక్కడ విఫలం అవుతుందన్న భయంతో అసలు ప్రారంభించకుండా ఉండటం వలన కొన్ని సార్లు అవకాశాలు వచ్చినప్పటికీ చేజార్చుకుంటారు. ప్రధాన గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం మీకు అన్ని విషయాల్లో కలిసి వస్తుంది.

ఆరోగ్యం

ఈ సంవత్సరం గురువు, రాహువు మరియు శని అనుకూల గోచారం ఉండటం వలన ఆరోగ్య సమస్యలు పెద్దగా మిమ్మల్ని బాధించవు. శారీరకంగా ఆరోగ్యంతో ఉంటారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అయితే కేతు గోచారం పన్నెండవ ఇంట ఉండటం వలన మానసికంగా కొంత ఆందోళనకు గురవుతుంటారు. అలాగే నిద్రలేమితో బాధ పడతారు. లేని సమస్యలను ఊహించుకొని బాధపడటం, మీ మీద మీకు నమ్మకం సన్నగిల్లటం జరుగుతుంది. అయితే మిగతా గ్రహాల అనుకూల ప్రభావం ఉండటం వలన ఈ సమస్యలు పెద్దగా బాధించవు.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం ఉద్యోగస్థులకు చాల అనుకూలంగా ఉంటుంది. కారక గ్రహమైన శని లాభ స్థానంలో సంచరించటం, గురు రాహువుల అనుకూల గోచారం కారణంగా ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతి లేదా స్థాన చలనం కోరుకుంటున్న వారికి అక్టోబర్ నుంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. మీరు కోరుకున్న పదవి దక్కటం కానీ, కోరుకున్న చోటికి బదిలీ అవటం కానీ జరుగుతుంది. అయితే ఆరవ ఇంట రాహువు కొంత అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని ఇస్తాడు. దాని కారణంగా మీ సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావటం కానీ, అనవసరమైన సమస్యలు రావటం కానీ జరగవచ్చు. అలాగే ప్రతి దానికి గొప్పలు చెప్పుకునే స్వభావం కూడా అలవడే అవకాశమున్నది. మీ ప్రవర్తన పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. దాని కారణంగా వత్సరాంతంలో చెడు పేరు వచ్చే అవకాశముంటుంది.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాల అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ప్రజల నమ్మకాన్ని చూరగొంటారు. దాని కారణంగా మీ వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ సంవత్సరం మంచి లాభాలను ఇస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకునే వారికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ వరకు గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం, నూతన వ్యాపారం ప్రారంభించటం, కొత్త ఒప్పందాలు చేసుకోవటం మంచిది.
ఆర్థికంగా ఈ సంవత్సరం చాల అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు రావటం, ఖర్చులు తగ్గటం వలన డబ్బు నిలకడ పెరుగుతుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యయ స్థానంలో కేతు గోచారం కారణంగా మీ తొందరపాటు వలన కొంత డబ్బు నష్టపోయే అవకాశం కనిపిస్తున్నది. ఖర్చుల విషయంలో, కొనుగోళ్ల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం.

కుటుంబం

ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం చాల అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు, నమ్మకం పెరగటం అలాగే ఇంట్లో శుభ కార్యాలు జరగటం వలన కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న మనస్పర్థలు కానీ, సమస్యలు కానీ తొలగి పోతాయి. వివాహం లేదా సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ తోబుట్టువుల సహాయ సహకారాలు మీకు ఉంటాయి. వారి కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకూల పరిణామాలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విదేశీయానం చేయటం కానీ, వినోద యాత్రలు చేయటం కానీ చేస్తారు. వ్యయ స్థానంలో కేతు గోచారం కారణంగా మీ కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడు ఏదో ఒక చింత మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అనవసర భయాలను వీడనాడి మీ కుటుంబ సభ్యులతో ఈ సంవత్సరాన్ని హాయిగా గడపండి.

చదువు

ఈ సంవత్సరం విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. చదువులో బాగా రాణించటమే కాకుండా ప్రశంసలు, అవార్డులు కూడా అందుకుంటారు. పన్నెండవ ఇంటిలో కేతు సంచారం కారణంగా కొంత భయం, సంకోచం కలిగి ఉంటారు. దీని కారణంగా కొత్త విషయాలు నేర్చుకోవటం కొంత నిరాసక్తత భయం కలిగి ఉంటారు. తల్లిదండ్రులు వారి భయాన్ని పోగొట్టి సరైన మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది.

పరిహారాలు

ఈ సంవత్సరం ప్రధానంగా కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. కేతు మంత్రం జపం కానీ, స్తోత్ర పారాయణం కాని చేయటం లేదా గణపతి పూజ స్తోత్ర పారాయణం చేయటం వలన ఆటంకాలు తొలగిపోతాయి

మకర రాశిఫలములు

మకర రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Kanya rashi telugu year predictions
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు (బో, జ, జి)
శ్రవణం 4 పాదాలు (జు, జే, జో, ఖ)
ధనిష్టా 1, 2 పాదాలు (గ, గి)
ఈ సంవత్సరం మకర రాశి వారికి అక్టోబర్ వరకు గురువు పదవ ఇంట, ఆ తర్వాత పదకొండవ సంచరిస్తాడు. శని సంవత్సరమంతా ధను రాశిలో వ్యయస్థానంలో సంచరిస్తాడు. సంవత్సరం చివరి వరకు రాహువు కర్కాటక రాశిలో సప్తమ స్థానంలో , కేతువు మకర రాశిలో జన్మ స్థానంలో సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ విలంబినామ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అక్టోబర్ వరకు గురు గోచారం మధ్యమంగా ఉండటం వలన అనుకున్న పనుల్లో ఆలస్యం అవటం, ఆర్థికంగా అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి లేక పోవటం జరుగుతుంది. అలాగే వృత్తిలో అనుకున్నంత ప్రగతి సాధించక పోవటం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. అయితే అక్టోబర్ నుంచి గురువు పదకొండింటికి రావటంలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకోవటం మొదలైన ఫలితాలుంటాయి.

ఆరోగ్యం

ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. గురు గోచారం అనుకూలంగా లేక పోవటం, శని పన్నెండవ ఇంట సంచారం కారణంగా ఎముకలు, పాదాలు, నడుము మరియు మెడలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశమున్నది. అయితే శని మీ రాశ్యాధిపతి అవటం మూలాన చెడు ప్రభావం అంతగా ఉండదు. లగ్నంలో కేతు సంచారం కారణంగా మానసికంగా తెలియని, భయానికి ఆందోళనకు గురవుతారు. లేని సమస్యలను ఊహించుకొని బాధపడటం, ఒంటరితనానికి లోనవటం జరుగుతుంది. అయితే అక్టోబర్ నుంచి గురువు పదకొండింట అత్యంత అనుకూలుడుగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. నూతనోత్సాహం వస్తుంది. మనస్థైర్యం పెరుగుతుంది.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. శని గోచారం అనుకూలంగా లేనప్పటికీ, గురు గోచారం బాగుండటం వలన వృత్తిలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ప్రథమార్థంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇతరుల బాధ్యతలను, పనులను మీరు చేయాల్సి వస్తుంది. తద్వారా పేరు రానప్పటికీ ఈ సమయంలో మీరు నేర్చుకున్నది మీ భవిష్యత్తుకు సహాయకారిగా ఉంటుంది. గురు గోచారం పదవ ఇంట ఉన్న సమయంలో మీరు చేసిన పనికి వేరే వాళ్ళు ప్రయోజనం పొందటం, మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాకపోవటం జరుగుతుంది. వ్యయస్థానంలో శని సంచారం కారణంగా కొంత కాలం విదేశాల్లో కానీ, ఇంటికి దూర ప్రదేశంలో కానీ పని చేయాల్సి వస్తుంది. ఇది అక్టోబర్ లోపు అయ్యే అవకాశమున్నది. అక్టోబర్ నుంచి ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మీరు ఎదురుచూస్తున్న పదోన్నతి కానీ, అనుకూల మార్పు కానీ జరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనువైన ఉద్యోగం లభిస్తుంది. మీ సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువ ఉండటం, పెట్టుబడులకు సరైన లాభాలు రాకపోవటం జరుగుతుంది. అక్టోబర్ వరకు గురు గోచారం సామాన్యంగా ఉండటం, శని రాహు గోచారం కూడా అనుకూలంగా లేక పోవటం వలన చేపట్టిన పనులు అలస్యమవటం జరుగుతుంది. చివరి నిమిషంలో అడ్డంకులు ఏర్పడతాయి. పెట్టుబడి పెడదామని ముందుకు వచ్చినవారు సమయానికి మాట మారుస్తారు. వ్యాపారంలో ఒకరోజు అనుకూలంగా ఒకరోజు వ్యతిరేకంగా ఉంటుంది. సప్తమ స్థానంలో రాహు గోచరం కారణంగా వ్యాపారంలో కానీ, చేసే ప్రదేశంలో కానీ అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. అక్టోబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం, సప్తమ స్థానం మీద గురు దృష్టి ఉండటం వలన వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. పెట్టుబడుల విషయంలో గతంలో వెనక్కి తగ్గినవారు మళ్ళి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. వ్యాపారంలో అనుకూలమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి.
ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. గురు గోచారం ప్రథమార్థంలో సామాన్యంగా ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అయితే శని పన్నెండవ ఇంట ఉండటం, సప్తమంలో రాహువు ఉండటం వలన పెట్టుబడి పెట్టిన డబ్బు సమయానికి రాకుండా కొంత ఇబ్బంది పెడుతుంది. అక్టోబర్ నుంచి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

కుటుంబం

ఈ సంవత్సరం కుటుంబం పరంగా అనుకూలంగా ఉంటుంది. గురు దృష్టి కుటుంబ స్థానం మీద ఉండటం, ద్వితీయార్థంలో గురువు పదకొండింట అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మెరుగవుతుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహ యోగం ఉంటుంది. అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం ఉంటుంది. అక్టోబర్ తర్వాత గురు దృష్టి పంచమ స్థానం మీద ఉంటుంది కాబట్టి అది మీ పిల్లల అభివృద్ధికి సహాయం చేస్తుంది. మీ ఆలోచనలు, సలహాలు మీ కుటుంబ సభ్యులకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వారి కొరకు మీరు చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి.

చదువు

ఈ సంవత్సరం విద్యార్థులకు చాల అనువుగా ఉంటుంది. అక్టోబర్ వరకు గురు దృష్టి చతుర్థ స్థానం మీద ఉండటం, అక్టోబర్ నుంచి పంచమ స్థానం మీద ఉండటం వలన చదువు పట్ల ఆసక్తి, పట్టుదల పెరగటమే కాకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఉన్నతవిద్యలో ప్రవేశం పొందుతారు. అయితే శని గోచారం పన్నెండవ ఇంట ఉండటం వలన అప్పుడప్పుడు చదువు పట్ల నిరాసక్తత, బద్ధకం ఏర్పడతాయి. దానిని తొలగించటానికి తల్లిదండ్రులు పిల్లలకు సరైన ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని అందించటం మంచిది.

పరిహారాలు

ఈ సంవత్సరం ప్రధానంగా శని, రాహు, కేతువులకు పరిహారాలు చేయటం మంచిది. ఈ మూడు గ్రహాలు అనుకూలంగా లేక పోవటం వలన పనుల్లో ఆలస్యం, అడ్డంకులు ఏర్పడటం, ఆరోగ్యసమస్యలు రావటం జరుగుతుంది. ఈ మూడు గ్రహాలకు పరిహారాలు చేయటం వలన వాటి చెడు ప్రభావం తగ్గుతుంది. దీనికి గాను శని, రాహు కేతువులు మంత్రం జపం చేయటం కానీ, స్తోత్ర పారాయణం చేయటం కానీ మంచది. ప్రత్యామ్నాయంగా ఈ గ్రహ అధిదేవతలైన హనుమాన్, దుర్గ మరియు గణేశ స్తోత్రాలు ప్రతి నిత్యం చదవటం మంచిది.

ధనుస్సు రాశిఫలములు

ధనుస్సు రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Kanya rashi telugu year predictions
మూల 4 పాదములు (యె, యో, బ, బి)
పూర్వాషాఢ 4 పాదములు (బు, ధ, భ, ఢ)
ఉత్తరాషాఢ 1వ పాదం (బె)
ఈ సంవత్సరం ధనూ రాశి వారికి గురువు అక్టోబర్ వరకు పదకొండవ ఇంట, తులా రాశిలో సంచరిస్తాడు, ఆ తర్వాత పన్నెండవ ఇంట, వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. శని సంవత్సరమంతా జన్మ రాశియైన ధనూ రాశిలో సంచరిస్తాడు. రాహువు, అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో, కేతువు ధన స్థానంలో మకర రాశిలో సంవత్సరం చివరి వరకు సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ సంవత్సరం మీకు ప్రథమార్థం చాల అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. ద్వితీయార్థంలో ఖర్చులు పెరగటం, స్థానచలనం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు మొదలైన ఫలితాలుంటాయి.

ఆరోగ్యం

ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ప్రథమార్థం అక్టోబర్ వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, ఆరోగ్యం మెరుగుపడటం జరుగుతుంది. జన్మాన శని, అష్టమాన రాహువు ఉన్నప్పటికీ, రాశ్యధిపతి గురువు పదకొండింట సంచరించటం వలన చాల వరకు ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అయితే అక్టోబర్ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గటం, చర్మ వ్యాధులు, గ్యాస్త్రిక్ సమస్యలు, మెడ నొప్పులు పెరగటం ఎముకల సంబంధ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవటం జరుగుతుంది. సరైన ఆహారం తీసుకోవటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం, శారీరక వ్యాయామం చేయటం వలన కొంతవరకు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు, ఉద్యోగంలో ఉన్నతి సాధించటం జరుగుతుంది. గురు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉండటంతో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. మీ పై అధికారుల అండ వలన పదోన్నతిని పొందుతారు. అయితే శని దృష్టి సప్తమ స్థానంపై ఉండటం, రాహు గోచారం కూడా అనుకూలంగా లేక పోవటం వలన మీకు అంతర్గత శత్రువులు, మీరు అంటే అసూయ కలవారు పెరిగే అవకాశమున్నది. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా ద్వితీయార్థంలో మీ పనులు చేసి పెడతామని చెప్పి మీకు చెడ్డ పేరు తీసుకురావటానికి ప్రయత్నించే వారు పెరుగుతారు.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొంత సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో మంచి లాభాలు వచ్చి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఈ సంవత్సరం అక్టోబర్ లోపు ప్రారంభించటం మంచిది. గురు బలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ద్వితీయార్థంలో వ్యాపారంలో, ఆర్థిక స్థితిలో మార్పులు చోటు చేసుకుంటాయి. గురువు వ్యయ స్థానంలో సంచరించటం వలన ఖర్చులు పెరుగుతాయి. పెట్టిన పెట్టుబడులనుంచి సరైన లాభాలు రావు. వచ్చే లాభాలు కూడా ఎన్నో ఆటంకాలతో వస్తాయి. సప్తమ స్థానం మీద శని దృష్టి ఉండటం వలన వ్యాపారం మందకొడిగా సాగుతుంది. రాహు గోచారం కూడా అనుకూలంగా లేక పోవటం వలన శత్రుభయం, పోటీ పెరగటం జరుగుతుంది.
ఆర్థికంగా ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో మంచి ధనా దాయం ఉంటే ద్వితీయార్థంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. వెనక ముందు చూడక డబ్బు ఖర్చు చేయటం వలన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. గురువు అనుకూలంగా ఉన్న సమయంలో డబ్బు పొదుపు చేసినట్లయితే గురువు అనుకూలంగా లేని సమయంలో ఆ డబ్బు ఉపయోగ పడుతుంది. తొందరపాటుకు, అత్యుత్సాహానికి పోయి అనవసరమైన ఖర్చులు పైన వేసుకోకండి.

కుటుంబం

ఈ సంవత్సరం కుటుంబపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. అక్టోబర్ వరకు గురు బలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో శుభకార్యాలు జరగటం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగటం జరుగుతుంది. అలాగే మీ మిత్రులు లేదా తోబుట్టిన వారి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. వారి సహాయంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. పంచమ స్థానంపై గురు దృష్టి కారణంగా సంతానం బాగా అభివృద్దిలోకి వస్తుంది. సంతానం కానీ వారికీ సంతానం అయ్యే అవకాశముంటుంది. అక్టోబర్ తర్వాత పరిస్థితులలో మార్పులు వస్తాయి. భార్య భర్తల మధ్య గొడవలు అపోహలు పెరగటం జరుగుతుంది. శని దృష్టి తృతీయ స్థానంపై ఉండటంలో మీ కంటే చిన్న వారితో లేదా ఇరుగుపొరుగు వారితో అనవసరమైన గొడవలు ఏర్పడతాయి. కొంతకాలం కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావచ్చు. శని జన్మ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి బద్ధకం, అనుమానాలు పెరిగే అవకాశముంటుంది. దాని కారణంగా కుటుంబ సభ్యులకు, మీకు మధ్యన దూరం పెరుగుతుంది. అలాగే రాహు గోచారం అనుకూలంగా లేక పోవటం వలన మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ, కొంత కాలం మీకు దూరంగా ఉండాల్సి రావటం కానీ జరుగుతుంది.

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్థంలో చదువు విషయంలో బాగా రాణిస్తారు. పడిన కష్టానికి రెట్టింపు ఫలితం పొందుతారు. ఉన్నతవిద్య విదేశాల్లో చేయాలనుకునే వారికీ ఈ సంవత్సరం కలిసి వస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అక్టోబర్ తర్వాత పరిస్థితులు మారతాయి. శని జన్మస్థానంలో గోచారం కారణంగా బద్ధకం పెరుగుతుంది. ప్రతి దాన్ని ప్రశ్నించటం, సాగదీయటం చేస్తారు. దాని వలన చదువు మీద శ్రద్ధ తగ్గటం జరుగుతుంది. లేని భయాలను, వైఫల్యాలను ఊహించుకొని అసలు చేయాల్సిన పనులను, చదువును వాయిదా వేస్తుంటారు. తల్లిదండ్రులు వారికీ సరైన మార్గం చూపించి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేయటం మంచిది.

పరిహారాలు

ఈ సంవత్సరం శని, రాహు మరియు గురు గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది. ఈ గ్రహాల మంత్రం జపం చేయటం కానీ, స్తోత్ర పారాయణం ప్రతిరోజూ చేయటం కానీ మంచిది. దీని వలన బద్ధకం, ఆటంకాలు తొలగిపోతాయి. ప్రత్యామ్నాయంగా ప్రతి రోజు హనుమాన్, దుర్గ మరియు గురు సంబంధ స్తోత్రాలు పారాయణం చేయటం మంచిది.

వృశ్చిక రాశిఫలములు

వృశ్చిక రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Kanya rashi telugu year predictions
విశాఖ 4వ పాదం(తో)
అనురాధ 4 పాదాలు (న, ని,ను, నే)
జ్యేష్ట 4 పాదాలు (నో, య, యి, యు)
ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ వరకు గురువు తుల రాశిలో, పన్నెండవ ఇంట సంచరిస్తాడు. శని సంవత్సరమంతా ధను రాశిలో, ద్వితీయ స్థానంలో సంచరిస్తాడు. రాహువు, కర్కాటక రాశిలో, తొమ్మిదవయింట, కేతువు మకర రాశిలో మూడవ ఇంట సంవత్సరాంతం వరకు సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది.

వృశ్చిక రాశి వారికి ఈ విలంబి నామ సంవత్సరం ప్రథమార్థం సామాన్యంగా, ద్వితీయార్థం మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. అక్టోబర్ వరకు ఆర్థికంగా, కుటుంబం పరంగా అంతగా అనుకూలంగా ఉండదు. ఖర్చులు చేయి దాటి పోతాయి. మీ మాటకు విలువ లేకుండా పోవటం, ప్రతి వారితో అనవసర వివాదాలు రావటం జరుగుతుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు కానీ, స్థాన చలనం కానీ ఉంటుంది. సంవత్సర ద్వితీయార్థం నుంచి పరిస్థితులు కొంత అనుకూలంగా మారతాయి.

ఆరోగ్యం

ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో అక్టోబర్ వరకు సామాన్యంగా ఉంటుంది. గురు, శనుల గోచారం అనుకూలంగా లేక పోవటం వల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కాలేయం, ఎముకలు, కళ్ళు, దంతాల, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. గురు గోచారం అనుకూలంగా లేక పోవటం వలన రోగ నిరోధక శక్తి తగ్గి ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. సరైన సమయానుకూల ఆహారం తీసుకోవటం, శారీరక వ్యాయామం చేయటం వలన చాల వరకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అక్టోబర్ నుంచి గురు గోచారం జన్మానికి రావటం వలన కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం ప్రథమార్థంలో వ్రుత్తి పరంగా కొంత సామాన్యంగా ఉంటుంది. గురు, శని గోచారం అనుకూలంగా లేక పోవటం వలన వృత్తిలో అభివృద్ధి కుంటుపడుతుంది. సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు తగ్గటం, అనవసర వివాదాల కారణంగా వారితో కొంత వ్యతిరేక వాతావరణం ఏర్పడుతుంది. వీలైనంత వరకు సలహాలు ఇవ్వకండి అది మళ్లి మీకే చెడుగా ఫలితమిస్తుంది. అలాగే ఆఫీస్ లో మిగతా వారి సహకారం సరిగా లేక పోవటం వలన ఒంటరితనానికి అసహనానికి గురవుతారు. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా పట్టుదలతో పనిచేయటం మంచిది. మీ ఓపిక మరియు సహనం మాత్రమే మీ విజయాలకు సాయపడతాయి. అయితే అక్టోబర్ లో గురువు మారటం వలన పరిస్థితులు కొంత అనుకూలంగా మారతాయి. వృత్తిలో కానీ, ప్రదేశంలో కానీ మార్పులు వస్తాయి. దాని కారణంగా ఇంతకాలంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి. విదేశీయానం కొరకు ఎదురు చూస్తున్నవారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాన్ని ఇస్తుంది.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఆదాయం కంటే ఖర్చులు, పెట్టుబడులు ఎక్కువగా ఉండటం వలన వచ్చిన లాభాలు, ఖర్చులు సమానం అవుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకునే వారు అక్టోబర్ వరకు ఆగటం మంచిది. అక్టోబర్ తర్వాత వ్యాపారంలో పరిస్థితులు కొంత అనుకూలంగా మారతాయి. సప్తమస్థానం పై గురు దృష్టి కారణంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
ఈ సంవత్సరం ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఆదాయం ఖర్చుల మధ్యలో పొంతన లేక పోవటంలో కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం పెట్టుబడులు వాయిదా వేసుకోవటం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడ గలుగుతారు. గృహ, వాహనాదులు కొనాలనుకునే వారు ఈ సంవత్సరం అక్టోబర్ వరకు ఆగటం మంచిది. అలాగే భూ సంబంధ లావాదేవీల్లో అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయటం మంచిది. ఈ విషయంలో తొందరపాటు పనికిరాదు.

కుటుంబం

ఈ సంవత్సరం శని గోచారం కుటుంబ స్థానంలో ఉండటం, కుటుంబ స్థానాధిపతి గురువు అక్టోబర్ వరకు వ్యయ స్థానంలో ఉండటం వలన కుటుంబ జీవితం అక్టోబర్ వరకు కొంత సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన సరైన అవగాహన లేక పోవటం, చీటికి మాటికి గొడవలు పడటం మొదలైన ఫలితాలుంటాయి. కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గటం కానీ, మీరిచ్చే సలహాలు పట్టించుకోక పోవటం వలన మీకు చిరాకు, కోపం పెరిగే అవకాశమున్నది. వీలైనంత వరకు ఓపికగా ఉండటం మంచిది. మీరు అనవసరమైన విషయాల్లో కల్పించుకోవటం వలన లేనిపోని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అక్టోబర్ నుంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకుంటుంది. శని మరియు రాహు గోచారం కారణంగా కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఇది మీ ఉద్యోగం లేదా ఇతర కారణాల వలన అయ్యే అవకాశమున్నది. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం విషయంలో మీకు కొంత ఆందోళన కలిగే అవకాశమున్నది. అక్టోబర్ నుంచి పరిస్థితులు మెరుగవుతాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుపడటమే కాకుండా, మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగి పోతాయి.

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. గురు దృష్టి అక్టోబర్ వరకు విద్య స్థానం మీద ఉండటం ఆ తర్వాత పంచమ, భాగ్య స్థానాల మీద ఉండటం వలన చదువు బాగా సాగుతుంది. అయితే శని దృష్టి కూడా చతుర్థ స్థానం మీద ఉండటం వలన బద్ధకం కూడా పెరిగే అవకాశముంటుంది. చదువు విషయంలో అశ్రద్ధ వహించక ఏకాగ్రతతో చదవటం మంచిది. అక్టోబర్ నుంచి గురు గోచారం కొంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ఈ సంవత్సరం మీ ఓపికకు, శ్రద్ధకు పరీక్షలాంటిది. మీరు ఎంత ఓపికగా కష్టపడి చదువుతారో అంతకు రెట్టింపు ఫలితం పొందుతారు.

పరిహారాలు

ఈ సంవత్సరం గురు, శని మరియు రాహు గ్రహాలకు పరిహారాలు ఆచరించటం మంచిది. దీని వలన ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు తగ్గుతాయి. దీనికి గాను గురు, శని, రాహు గ్రహ జపం చేయటం లేదా స్తోత్రాలు చదవటం మంచిది. ప్రత్యామ్నాయంగా గురు చరిత్ర పారాయణం చేయటం కానీ సాయిబాబా, దత్తత్రేయ సంబంధ ఆలయ దర్శనం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గ స్తోత్ర పారాయణం చేయటం మంచిది.

తులా రాశిఫలములు

తులా రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

తులారాశి జయ రాశి ఫలాలు
చిత్త 3, 4 పాదాలు (ర,రి),
స్వాతి నాలుగు పాదాలు (రు, రె, రో,త),
విశాఖ 1, 2, 3 పాదాలు (తి, తు, తే)
తులా రాశి వారికి ఈ సంవత్సరం గురువు జన్మస్థానమైన తుల రాశిలో అక్టోబర్ దాక సంచరిస్తాడు. ఆ తర్వాత రెండవ ఇంట వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. శని సంవత్సరమంతా ధను రాశిలో, మూడవ ఇంట సంచరిస్తాడు. రాహువు పదవ ఇంట కర్కాటక రాశిలో, కేతువు నాలగవ ఇంట మకర రాశిలో సంవత్సరం చివరి వరకు సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ విలంబి నామ సంవత్సరం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. అక్టోబర్ వరకు గురు గోచారం సామాన్యంగా ఉన్నప్పటికీ, శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కొన్ని అనుకోని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కుంటారు. కుటుంబ పరంగా ఈ సంవత్సరం ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది

ఆరోగ్యం

ఈ సంవత్సరం గురు గోచారం అక్టోబర్ వరకు జన్మ రాశిలో ఉండటం వలన ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. మిగతా గ్రహాల గోచారం అనుకూలంగా ఉండటం అలాగే అక్టోబర్ నుంచి గురు గోచారం కూడా అనుకూలంగా మారటం వలన ఆరోగ్యం విషయంలో అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు గోచారం అనుకూలంగా లేని సమయంలో కాలేయ సంబంధ సమస్యలు, నడుము, వెన్ను నొప్పి సంబంధ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశమున్నది. అలాగే కేతు గోచారం నాలగవ ఇంట మంచిది కాదు కాబట్టి చర్మ సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశమున్నది. శని గోచారం సంవత్సరమంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినా అవి కొంత కలం వరకే ఇబ్బంది పెడతాయి. మిగతా సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉంటారు.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఉద్యోగులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండటం, అక్టోబర్ నుంచి గురు గోచారం కూడా అనుకూలంగా మారుతుంది కాబట్టి ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. పదోన్నతి కొరకు లేదా ఉద్యోగంలో మంచి మార్పు కొరకు ఎదురు చూస్తున్న వారికీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ప్రతిభకు, పనికి గుర్తింపు లభిస్తుంది. దశమ స్థానంలో రాహువు అనుకూల ఫలితాలను ఇస్తాడు కానీ అదే సమయంలో పని పట్ల మీకు కొంత నిర్లక్ష్యాన్ని, అహంకారాన్ని ఇస్తాడు. బాధ్యతల విషయంలో ఎత్తి పరిస్థితిలో నిర్లక్ష్యానికి చోటు ఇవ్వకండి అది మీ వృత్తి మీద, మీ జీవన విధానం మీద ప్రభావం చూపే అవకాశమున్నది. దాని కారణంగా మీ వృత్తిలో అనుకోని మార్పులు చోటు చేసుకోవటం కానీ, శత్రువులు పెరగటం కానీ జరగవచ్చు. అలాగే జన్మ స్థానంలో గురు గోచారం ఉన్నంత వరకు మీ ఉద్యోగ విషయంలో ఎదో ఒక సమస్య లేదా భయం మిమ్మల్ని పీడిస్తుంది. దాని కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారు ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత మారటం మంచిది. అక్టోబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీ పై అధికారుల మన్ననలు, గుర్తింపు లభిస్తుంది. చాలాకాలం నుంచి వాయిదా పడుతున్న పదోన్నతి కానీ, అనుకూల మార్పు కానీ చోటు చేసుకుంటుంది.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ప్రథమార్థంలో కొంత సామాన్య ఫలితాలను చూసినా ద్వితీయార్థంలో మాత్రం అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. రాహు గోచారం మీ వ్యాపారానికి మంచి ప్రచారాన్ని, నమ్మకాన్ని తెచ్చి పెడుతుంది. అయితే అత్యుత్సాహానికి పోయి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ చేయకండి, ముఖ్యంగా అక్టోబర్ వరకు ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మీతో పెట్టుబడి పెట్టించటం కానీ, మోసం చేయటం కానీ జరుగుతుంది. చెప్పుడు మాటలకూ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకండి.
ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థం లో కొంత ఖర్చులు పెరిగిన, అక్టోబర్ తర్వాత నుంచి ఆదాయం పెరగటం ఖర్చులు కూడా తక్కువ అవటం వలన ఆర్థిక సమస్యలు తొలగి పోవటమే కాకుండా, గృహ, వాహనాది సౌకర్యాలను కూడా కొనుగోలు చేస్తారు. చతురత స్థానంలో కేతు గోచారం కారణంగా ప్రథమార్థంలో గృహ సంబంధ విషయాలకు లేదా ఆరోగ్య సంబంధ విషయాలకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. అక్టోబర్ తర్వాత ఖర్చులు అదుపులోకి వస్తాయి, దయం కూడా పెరుగుతుంది.

కుటుంబం

కుటుంబం పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థం కొన్ని సమస్యలను ఎదుర్కొన్న, ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలను పొందుతారు. అక్టోబర్ లోపు మీ తప్పుడు నిర్ణయాలు లేదా కోపం కారణంగా మీ కుటుంబ సభ్యులు కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశమున్నది. అలాగే బాధ్యతలు తీసుకొని తర్వాత వాటిని మరిచిపోవటం లేదా నిర్లక్ష్యం చేయటం వలన కూడా కొంత ఇబ్బందులు మనస్పర్థలు ఎదురవుతాయి. అయితే అక్టోబర్ నుంచి అన్ని సమస్యలు, అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అక్టోబర్ తర్వాత కుటుంబంలో వివాహం కానీ, సంతానం కానీ లేదా ఏదైనా శుభకార్యం కానీ జరిగే అవకాశమున్నది. మీ సంతానం కూడా మంచి అభివృద్ధి లోకి వస్తారు. చతుర్థ స్థానంలో కేతు గోచారం కారణంగా కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళనను కలిగిస్తుంది. అయితే అక్టోబర్ తర్వాత ఆరోగ్య సమస్యలు తొలగి పోతాయి. మీ వైవహిక జివితం కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి విదేశీయానం కానీ, వినోదయాత్రలు కానీ చేస్తారు.

చదువు

ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చదువు పట్ల శ్రద్ధ పెరగటమే కాకుండా, మంచి గుర్తింపుని కూడా పొందుతారు. ఉన్నత విద్య ప్రయత్నాలు చేస్తున్న వారు కానీ, విదేశాల్లో చదవాలని ప్రయత్నాలు చేస్తున్న వారు కానీ ఈ సంవత్సరం అనుకూల ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి విద్యార్థులకు అన్ని రకాలుగా కలిసి వచ్చే సమయం. అయితే నాలుగవ ఇంట కేతు గోచారం కొంత భయాన్ని, బద్దకాన్ని ఇచ్చే అవకాశముంటుంది.

పరిహారాలు

ఈ సంవత్సరం అక్టోబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి గురువుకు, అలాగే చతుర్థ స్థానంలో కేతు గోచారం మంచిది కాదు కాబట్టి కేతువుకు పరికరాలు చేసుకోవటం మంచిది. దీనికి గాను గురు, కేతువుల మంత్రం జపం కానీ, స్తోత్ర పారాయణం చేయటం కానీ చేయాలి. ప్రత్యామ్నాయంగా గణేశ స్తోత్రం చదవటం కానీ, గురు చరిత్ర పారాయణం చేయటం కానీ చేయాలి.

కన్య రాశిఫలములు

కన్య రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Kanya rashi telugu year predictions
ఉత్తర 2,3, 4 పాదాలు (టొ, ప, పి)
హస్త 4 పాదాలు (పు, షం, ణ, ఠ)
చిత్త 1,2 పాదాలు (పె, పొ)
ఈ సంవత్సరం కన్య రాశి వారికి గురువు రెండవ ఇంట తుల రాశిలో అక్టోబర్ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత మూడవ ఇంటికి మారతాడు. శని సంవత్సరమంతా నాలగవ ఇంట ధనూ రాశిలో సంచరిస్తాడు. రాహువు పదకొండింట, కర్కాటక రాశిలో సంవత్సరాంతం వరకు సంచరిస్తాడు. కేతువు మకర రాశిలో, పంచమ స్థానంలో సంవత్సరాంతం వరకు సంచరిస్తాడు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ సంవత్సరం ఆర్థికంగా, కుటుంబం పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్రుత్తి పరంగా ఒత్తిడి, మర్పూ ఉంటాయి. నివాస స్థలంలో మార్పు ఉంటుంది. గురు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే మీ కుటుంబ సహాయ సహకారాలు ఉంటాయి.రాహు గోచారం లభాస్తానంలో ఉండటం ములన మీరు చాల కాలంగా ఎదురు చూస్తున్న పనులు, కోరికలు అనుకూలమైన ఫలితాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. శని గోచారం పని ఒత్తిడిని పెంచుతుంది అలాగే మార్పులను ఇస్తుంది.

ఆరోగ్యం

ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థం అనుకూలంగా ఉంటే ద్వితీయార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. గురు గోచారం అక్టోబర్ వరకు, రాహు గోచారం సంవత్సరాంతం వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత కొంత కాలంగా మిమ్మల్ని బాధిస్తున్న ఆరోగ్య సమస్యలు తొలగి పోవటమే కాకుండా మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. అయితే శని గోచారం నాలగవ ఇంట అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంటుంది. ముఖ్యంగా ఎముకలు, ఊపిరితిత్తులు మరియు మోకాళ్లకు సంబంధించిన ఆరోగ్యసమస్యలు ఎక్కువగా ఉండే అవకాశమున్నది. అలాగే గాస్త్రిక్ సంబంధ సమస్యలు కూడా మిమ్మల్ని బాధిస్తాయి. సరైన ఆహార అలవాట్లు కలిగి ఉండటం, సమయానుకూల విశ్రాంతి వలన చాల వరకు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే పంచమ స్థానంలో కేతు గోచారం గుండె దడ అనవసర భయాలను, ఆందోళనలను ఇస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించటం, ప్రతి చిన్న దానికి ఎక్కువ ఆందోళన పడకుండా ఉండటం మంచిది.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఉద్యోగ విషయంలో ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే వృత్తిలో ఒత్తిడి, కొత్త సవాళ్లు ఎదురవుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేయటంలో ఆటంకాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. చిన్న పని కూడా ఎక్కువ శ్రమతో పూర్తి చేయాల్సి వస్తుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఈ సమయం ఎంతగానో సహాయపడుతుంది. గురు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృత్తిలో గుర్తింపు, ప్రమోషన్ లేదా పురస్కారాలు లభిస్తాయి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ సహోద్యోగుల, మిత్రుల సహకారంతో ఒత్తిడిని ఎదుర్కొన గలుగుతారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వృత్తిలో కానీ, నివాస స్థలం లో కానీ మార్పులు ఉంటాయి. కొందరి విదేశీయాన ప్రాప్తి కూడా ఉంటుంది. రాహు గోచారం సంవత్సరాంతం వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృత్తి పరంగా చాల విషయాల్లో మీది పై చేయిగా ఉంటుంది. కానీ కొంత అహంకారం కానీ, తొందరపాటు కానీ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి విజయాలకు పొంగి పోకుండా, అపజయాలకు కుంగి పోకుండా పని మీద దృష్టి పెట్టడం మంచిది.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పెట్టున పెట్టుబడులకు మంచి లాభాలు రావటమే కాకుండా చాల కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు కూడా దూరం అవుతాయి. దాని వలన వ్యాపారం అభివృద్ధి చెందటమే కాకుండా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మీ వ్యాపారానికి, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. ద్వితీయార్థంలో వ్యాపార స్థలంలో కానీ, వ్యాపార ఒప్పందాలలో కానీ అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే పని ఒత్తిడి కొంత పెరుగుతుంది. అలాగే ఆదాయం కొంత తగ్గటం కానీ పెట్టుబడులు పెరగటం కానీ జరుగుతుంది.
ఆర్థికంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో గురు, రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే మీకు రావలసిన బకాయిలు వసూలవటం కానీ, బ్యాంక్ లోను లభించటం కానీ జరుగుతుంది. కొత్తగా భూమి లేదా గృహ సంబంధ కొనుగోళ్లకు అక్టోబర్ వరకు సమయం చాల అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత చేసే కొనుగోళ్ల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

కుటుంబం

ఈ సంవత్సరం గురు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబ విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి వివాహం కానీ, సంతానం కానీ అవుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్థలు తొలగి పోతాయి. నూతన గృహ, వాహన యోగాలు ఈ సంవత్సరం సూచించ బడుతున్నాయి. మీ కుటుంబ సభ్యుల సహకారం, మిత్రుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. ద్వితీయార్థంలో గురు గోచారం అలాగే శని గోచారం అనుకూలంగా లేక పోవటం వలన కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశమున్నది. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. శని దృష్టి లగ్న స్థానం మీద పడుతుంది కాబట్టి అసహనాన్ని, కోపాన్ని అలాగే బద్దకాన్ని తగ్గించుకోవటం మంచిది. దాని వలన మీ కుటుంబ సభ్యులు బాధ పడే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ఈ సంవత్సరం ఉద్యోగం దొరికే అవకాశమున్నది. సంతానం కానీ వారికీ ఈ సంవత్సరం ప్రథమార్థం లో సంతానయోగం ఉంటుంది.

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించటమే కాకుండా, పలువురి ప్రశంసలు కూడా అందుకుంటారు. పరీక్షలలో అనుకున్న దాని కంటే ఎక్కువగా మార్కులు లేదా ర్యాంక్ రావటం జరుగుతుంది. అయితే శని గోచారం నాలుగవ ఇంట ఉండి లగ్నాన్ని చూడటం వలన అప్పుడప్పుడు చదువు మీద నిరాసక్తత, బద్ధకము పెరుగుతాయి. అలాగే చదువు పట్ల నిర్లక్ష్యము పెరుగుతుంది. ఎప్పటికప్పుడు చదువును రివ్యూ చేసుకుంటూ తప్పులను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళటం వలన చదువు విషయంలో ఇబ్బందులు ఎదురు కావు

పరిహారాలు.

ఈ సంవత్సరం ప్రధానంగా శనికి పరిహారాలు ఆచరించటం మంచిది. దాని వలన బద్ధకం తొలగి పోవటమే కాకుండా పని పట్ల శ్రద్ధ, పట్టుదల పెరుగుతాయి. దీనికి గాను శనికి పూజ లేదా జపం చేయటం మంచిది. అలాగే రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం కూడా మంచిది. అక్టోబర్ తర్వాత గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి గురు పూజ, జపం, స్తోత్ర పారాయణం చేయటం మంచిది.

సింహ రాశిఫలములు

సింహ రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

సింహ రాశి తెలుగు Telugu Rashiphal
మఖ 4 పాదాలు (మ, మి, ము, మే),
పుబ్బ 4 పాదాలు (మో, ట, టి, టు)
ఉత్తర 1వ పాదం (టె)
ఈ సంవత్సరం సింహ రాశి వారికి గురువు అక్టోబర్ వరకు మూడవ ఇంటిలో తుల రాశిలో, ఆ తర్వాత నాలగవ ఇంటిలో వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. శని సంవత్సరమంతా ఐదవ ఇంట్లో, ధనూ రాశిలో సంచరిస్తాడు. రాహువు పన్నెండవ ఇంట, కర్కాటక రాశిలో, కేతువు ఆరవ ఇంట మకర రాశిలో సంవత్సరం చివరి వరకు సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఆచరణ రూపంలోకి రాకముందే అడ్డంకులు ఎక్కువగా కలుగుతాయి. మీ ఆలోచనలను వ్యతిరేకించేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. మీరిచ్చిన సలహాలు పాటించి తర్వాత మిమ్మల్నే మాట అనే వారు ఎక్కువ అవుతారు. అలాగే మిత్రులతో దగ్గరి వారితో అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి. ఆర్థిక విషయాలలో కూడా అనుకోని సమస్యలు వచ్చే అవకాశముంటుంది. ఈ సంవత్సరం మీ మానసిక స్థైర్యానికి పరీక్ష లాంటిది. ఈ సమయాన్ని ఎంత బాగా ఎదుర్కుంటే మీకు విజయాలు అంత ఎక్కువగా వస్తాయి.

ఆరోగ్యం

ఈ సంవత్సరం చివరి వరకు రాహు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మెడ నొప్పులు, గాస్త్రిక్ సమస్యలు అలాగే మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మీ ఆరోగ్యసమస్యలకు మీ మానసిక ఆందోళన కారణం అవుతుంది. లేని సమస్యను, వ్యాధులను ఉన్నట్టు ఊహించుకొని భయపడటం ఎక్కువ అవుతుంది. నిజానికి మీకు ఈ సంవత్సరం శారీరక ఆరోగ్యసమస్యలు ఎక్కువగా లేక పోయినప్పటికీ మానసికంగా ఏదో సమస్య ఉన్నట్టు ఊహించుకోవటం వలన ఎక్కువ బాధ పడతారు. ఈ సంవత్సరం మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం ప్రథమార్థంలో వృత్తిలో కానీ చేసే ప్రదేశంలో కానీ మార్పులు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి దూర ప్రాంతానికి కానీ, విదేశాలకు కానీ బదిలీ అయ్యే అవకాశమున్నది. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. పంచమ స్థానంలో శని సంచారం కారణంగా మీ సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు తక్కువగా అందుతాయి. అయితే మీ పట్టుదల, మీ నైపుణ్యం మిమ్మల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయి. ఎవరి సహకారం లేకున్నా మీ కష్టంలో చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆవేశానికో లేక పట్టుదలకో పోయి అదనపు పనులకు బాధ్యతలకు ఒప్పుకోకండి అది మీకు లేని సమస్యలను తెచ్చి పెడుతుంది. మిమ్మల్ని ప్రేరేపించి మీతో పనులు చేయించుకునే వారు ఎక్కువగా ఉంటారు అలంటి వారి విషయంలో జాగ్రత్త అవసరం. వారి కారణంగా మీ పనులు చెడి పోవటమే కాకుండా మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశముంటుంది. ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్న వారు మంచి అవకాశం అయినప్పుడు మారటం మంచిది. ఈ విషయంలో రిస్క్ చేయటం అంతగా అనుకూలం కాదు. విదేశాల్లో ఉన్నవారు కూడా వీసా విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ నిర్లక్ష్యం మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మాధ్యమంగా అనుకూలిస్తుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించినప్పటికీ అప్పుడప్పుడు అనుకోని ఇబ్బందులు, నష్టాలూ ఎదురయ్యే అవకాశముంటుంది. మీ గురించి, మీ వ్యాపారం గురించి చేదుగా ప్రచారం చేసే వారు ఎక్కువ అవుతారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త అవసరం. మిమ్మల్ని పొగడ్తలతో ముంచి అలాగే మీకు అవసరం లేని పెట్టుబడులు పెట్టించే వారు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటారు. ఏ విషయంలో అయిన ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయటం మంచిది. అక్టోబర్ తర్వాత గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆలోపే మీరు వ్యాపార విషయంలో చేయాల్సిన పనులు చేయటం మంచిది.
ఈ సంవత్సరం ఆర్థిక స్థితి బాగానే ఉన్నప్పటికీ, అనవసరమైన ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెట్టుబడులు, కొనుగోళ్ల విషయంలో జాగ్రత్త అవసరం. మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కుటుంబం

ఈ సంవత్సరం ప్రథమార్థంలో కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమాభిమానాలు పెరగటం. గొడవలు, మనస్పర్థలు సమసిపోవటం జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో వివాహం కానీ, సంతానం అవటం కానీ జరుగుతుంది. మీకు అనుకూలంగా లేని సమయంలో మీ కుటుంబ సభ్యులే మీకు పెద్ద అండగా ఉంటారు. శని పంచమ స్థానంలో గోచారం కారణంగా మీ సంతానంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు కానీ వేరే సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. మీ బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా అనుకుంటారు. అక్టోబర్ తర్వాత గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల విషయంలో అపోహలకు, ఆవేశాలకు లోను కాకుండా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉంటె చాల వరకు సమస్యలు దూరం అవుతాయి. రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి మీకు ప్రతి చిన్న విషయానికే ఆవేశం పెరిగే అవకాశమున్నది. కొంత ఓపికను అలవారచుకోవటం అలాగే ఏ నిర్ణయమైన కొంత సమయం తీసుకొని తీసుకోవటం వలన కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది.

చదువు

ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహు గోచారం సంవత్సరమంతా అనుకూలంగా లేక పోవటం వలన చదువు విషయంలో నిరాశకు, అనాసక్తికి గురవుతారు. అనవసరమైన భయాలు పెట్టుకొని చదువు మీద శ్రద్ద తగ్గించుకునే అవకాశముంటుంది. వారికి ధైర్యాన్ని, ఆసక్తిని పెంపొందించేలా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించటం మంచిది. ద్వితీయార్థంలో గురు గోచారం కూడా అనుకూలంగా ఉండక పోవటం వలన బద్ధకం పెరగటం చిన్న పనికే ఎక్కువ అలసిపోవటం జరుగుతుంది. అయితే కేతు గోచారం అనుకూలంగా ఉండటం వలన పరీక్షలలో అనుకున్న ఫలితాలు రావటం వలన కొంత సహాయకారిగా ఉంటుంది. విదేశాల్లో చదవాలనుకునే వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలు

ఈ సంవత్సరం ప్రధానంగా గురు, రాహు గ్రహాలు అనుకూలంగా ఉండవు కాబట్టి ఈ రెండు గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది. దీనికిగాను గురు రాహు గ్రహాల జపం చేయటం కానీ, స్తోత్ర పారాయణం చేయటం కానీ చేయాలి. లేదా గురు చరిత్ర పారాయణం, దుర్గ స్తోత్ర పారాయణం చేయటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటక రాశిఫలములు

కర్కాటక రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు



గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

కర్కTelugu Rashiphal, తెలుగు Telugu Rashiphal
పునర్వసు 4వ పాదము (హి) 
పుష్యమి 1, 2, 3, పాదములు (హు, హె, హో, డా) 
ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)
మీకు ఈ సంవత్సరం అక్టోబర్ వరకు గురువు నాలగవ ఇంట సంచరిస్తాడు, ఆ తర్వాత ఐదవ ఇంటసంవత, వృశ్చిక రాశిలో అనుకూలుడుగా సంచరిస్తాడు. శని సంవత్సరం అంతా ఆరవ ఇంట కర్కాటక రాశిలో అనుకూలుడుగా సంచరిస్తాడు. రాహువు కర్కాటక రాశిలో, జన్మాన, కేతువు మకర రాశిలో సప్తమ స్థానంలో సంవత్సరాంతం వరకు సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత మిశ్రమ ఫలితాలను, ద్వితీయార్థం అనుకూల ఫలితాలను ఇస్తుంది. వృత్తి పరంగా, ఆర్థికంగా ప్రథమార్థంలో అక్టోబర్ వరకు కొంత ప్రతికూలతను, ఒత్తిడిని ఎదుర్కుంటారు. మానసిక సంఘర్షణకు లోనవుతారు. కొన్ని సార్లు అత్యుత్సాహం కారణంగా దగ్గరి వారితో విరోధాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దాని కారణంగా వారికీ దూరం అవటం జరుగుతుంది. అక్టోబర్ నుంచి మాత్రం చాల విషయాలు అనుకూలంగా మారతాయి.

ఆరోగ్యం

అక్టోబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి తరచూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశమున్నది. అక్టోబర్ నుంచి ఆరోగ్యం బాగుంటుంది. అయితే రాహు గోచారం ఈ సంవత్సరం చివరి వరకు లగ్నంలో, వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి రాహు కారక ఆరోగ్యసమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశముంటుంది. మెడ నొప్పులు, గాస్త్ర్రిక్ సమస్యలు, ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశమున్నది. సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండటం, అక్టోబర్ నుంచి గురువు కూడా అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చిన అవి మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టవు.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం చాల అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. శని ఆరవ ఇంట గోచారం ఉద్యోగస్థులకు చాల కలిసి వస్తుంది. వారి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు కానీ, మంచి మార్పు కొరకు కానీ ఎదురు చూస్తున్న వారికి అక్టోబర్ తర్వాత అనుకూల ఫలితాలు వస్తాయి. మీ సహోద్యోగుల నుంచి పై అధికారుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో వృత్తిలో అధిక శ్రమ, ఒత్తిడిని కలిగి ఉంటారు. ఒకరకంగా మీరు నిజాయితీగా చేసిన పనికి ప్రతిఫలం అక్టోబర్ తర్వాత అందుకుంటారు. రాహు గోచారం కొంత అహంభావాన్ని, తలబిరుసుతనాన్ని, ధిక్కార స్వభావాన్ని ఇచ్చే అవకాశముంటుంది కాబట్టి వీలైనంత వరకు మీ మనసును అదుపులో ఉంచుకోవటం మంచిది. అది మీకు మంచి భవిష్యత్తును ఇస్తుంది.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. మీ కింద పనిచేసే వారి సహాయ సహకారాల వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. అక్టోబర్ తర్వాత పెట్టె పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. అక్టోబర్ కంటే ముందు చేసే కొనుగోళ్లు కొంత సామాన్య ఫలితాన్ని ఇస్తాయి.
ఆర్థికంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరగటమే కాకుండా ఖర్చులు కూడా తగ్గుతాయి. గతంలో ఉన్న ఆర్ధిక సమస్యలు తొలగి పోతాయి. రావలసిన ఆర్ధిక సహాయం అందుకుంటారు. ఇల్లు కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేస్తారు. మీలో కొంత మందికి వాహన యోగం కూడా ఉంటుంది.

కుటుంబం

ఈ సంవత్సరం అక్టోబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కుటుంబంలో కొంత ఇబ్బంది కరమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్య అపోహలు ఎక్కువ అవటం లేదా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావటం జరుగుతుంది. అక్టోబర్ లో గురువు ఐదవ ఇంట సంచారం మొదలయ్యాక కుటుంబంలో అనుకూల వాతావరణం ప్రారంభం అవుతుంది. అపోహలు అపార్థాలు తొలగి పోయి కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమపూర్వక వాతావరణం నెలకుంటుంది. మీ కుటుంబ అవసరాలను ఏంటో బాధ్యతాయుతంగా నెరవేరుస్తారు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి, ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత సంతానం అయ్యే అవకాశమున్నది. అలాగే వివాహం కానీ వారికీ కూడా సంవత్సర ద్వితియార్థంలో వివాహం అవుతుంది. లగ్నంలో రాహువు, సప్లమంలో కేతువు సంచారం కారణంగా భార్యాభర్తల మధ్యన వాదోపవాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ఓపికతో మెలగటం మంచిది.

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. గురు గోచారం విద్య స్థానమైన నాలగవ ఇంట ఉండటం వలన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం దాని కారణంగా చదువుపై ఏకాగ్రత తగ్గటం జరుగుతుంది. ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా తమపై తాము నమ్మకం కలిగి ఉండి చదువు మీద దృష్టి సారిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అక్టోబర్ తర్వాత నుంచి గురువు ఐదవ స్థానంలో అనుకూలుడుగా సంచరిస్తాడు కాబట్టి అప్పటి నుంచి చదువు అభివృద్ధి చెందుతుంది. చదువు మీద ఏకాగ్రత పెరగటం అలాగే ఆసక్తి పెరగటం జరుగుతుంది. పరీక్షలలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. శని గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన విద్య పూర్తి చేసుకుని ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది.

పరిహారాలు

ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి గురువుకు పరిహార క్రియలు చేయటం మంచిది. దీనికి గాను గురు మంత్రం జపం, స్తోత్ర పారాయణం లేదా గురు చరిత్ర పారాయణం చేయటం మంచిది. అలాగే రాహు, కేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ రెండు గ్రహాలకు కూడా పరిహారాలు చేయటం మంచిది. దీనికిగాను రాహు, కేతు జపాలు కానీ, స్తోత్రాలు కానీ చదవటం మంచిది. ఇవి చేయటం వీలు కానీ వారు దుర్గ స్తోత్రం, గణేశ స్తోత్రం ప్రతి రోజు చదవటం మంచిది..