Friday 6 April 2018

మీన రాశిఫలములు

మీన రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Kanya rashi telugu year predictions
పూర్వాభాద్ర 4వ పాదం (ది)
ఉత్తరాభాద్ర 4 పాదాలు (దు, శం, ఝ, థ)
రేవతి 4 పాదాలు (దే, దో, చ, చి)
ఈ సంవత్సరం మీన రాశి వారికి గురువు అక్టోబర్ వరకు అష్టమ స్థానంలో, తుల రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత వృశ్చిక రాశిలో, భాగ్యస్థానంలో సంచరిస్తాడు. శని సంవత్సరమంతా పదవ ఇంట ధనూ రాశిలో సంచరిస్తాడు. రాహువు కర్కాటక రాశిలో పంచమ భావంలో, కేతువు మకర రాశిలో లాభ స్థానంలో సంచరిస్తాడు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ అక్టోబర్ నుంచి మాత్రం మీకు చాల అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఆర్థిక సమస్యలు, ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ద్వితీయార్థంలో సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. నూతన గృహ, వాహనాదులు కొనుగోలు చేస్తారు. గత సంవత్సర కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగి పోతాయి

ఆరోగ్యం

ఈ సంవత్సరం అక్టోబర్ వరకు ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. తరచూ ఏదో ఒక అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. కాలేయం, మూత్రపిండాలు, జననేన్ద్రియలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా బాధించే అవకాశమున్నది. అయితే మిగతా గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చినా అవి ఎక్కువ కాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అక్టోబ నుంచి గురు గోచారం కూడా అనుకూలంగా మారటంతో ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. మిగతా సంవత్సరమంతా ఆరోగ్య విషయంలో పెద్దగ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు,

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. పదవ ఇంట శని గోచారం ఉద్యోగంలో మంచి మార్పులను, గుర్తింపును ఇస్తుంది. అయితే అక్టోబర్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండక పోవటం వలన ఉద్యోగంలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. అకస్మాత్తుగా ఉద్యోగం మారాల్సి రావటం కానీ, అవమానాలు ఎదుర్కోవాల్సి రావటం కానీ జరుగుతుంది. మీ సహోద్యోగులు కానీ, మీ పై అధికారులు కానీ మిమ్మల్ని తమ మాటలతో లేదా ప్రవర్తనలో ఇబ్బంది పెట్టె అవకాశమున్నది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించక ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొంత ఇబ్బందిని ఎదుర్కుంటారు. అక్టోబర్ లో గురువు మారాక మీది పై చేయి అవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అవసరాన్ని, ప్రతిభను మీ పై అధికారులు గుర్తిస్తారు. ఉద్యోగంలో మంచి ప్రగతి సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఎదురు చూస్తున్నవారు ద్వితీయార్థంలో అనుకూల ఫలితాన్ని పొందుతారు. శని గోచారం పదవ ఇంట ఉండటం వలన వృత్తిలో మీ ప్రతిభను చూపించుకునే అవకాశాలు చాల వస్తాయి. అవి భవిష్యత్తులో మీ అభివృద్ధికి తోడ్పడేలా ఉంటాయి.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్థం మాత్రం చాల అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో పెట్టిన పెట్టుబడులకు సరైన లాభాలు రాక కొంత ఇబ్బందికి గురవుతారు. మీరు నమ్మిన వ్యక్తులే మీకు చెడు చేయాలనీ చూడటం కానీ, మిమ్మల్ని అవమానించాలని కానీ చూస్తారు. అలాగే నమ్మి ఇచ్చిన డబ్బులు మోసపోయే అవకాశముంటుంది కాబట్టి డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులు కానీ, కొత్త వ్యాపారం ప్రారంభం చేయటం కానీ అక్టోబర్ వరకు అంతగా అనుకూలించదు. అక్టోబర్ తర్వాత నుంచి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభం అవుతాయి. రావు అనుకున్న డబ్బులు తిరిగి వస్తాయి.
ఆర్థికంగా ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావటం, ఆరోగ్య సమస్యలకు, కుటుంబం కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావటం వలన ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. ముందు వెనక చూడక ఖర్చు చేయటం తగ్గించటం మంచిది. అక్టోబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెట్టిన పెట్టుబడులకు మంచి ఫలితం వస్తుంది. నూతన గృహ యోగం కానీ, వాహన యోగం కానీ అక్టోబర్ తర్వాత ఉంటుంది.

కుటుంబం

ఈ సంవత్సరం కుటుంబ జీవితం ప్రథమార్థం కొంత సామాన్యంగా ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామికి కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశమున్నది. దాని కారణంగా కొంత ఆందోళనకు గురవుతారు. అయితే సమస్యలు వచ్చినప్పటికీ వాటి వలన మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు, నమ్మకం పెరుగుతాయి . మీ తల్లిదండ్రుల నుంచి మీకు సాయం అందుతుంది, అలాగే వారికి గర్వం కలిగించే పనులు ద్వితీయార్థంలో మీరు చేస్తారు. ఇంట్లో వివాహం, కానీ ఇతర శుభకార్యాలు కానీ జరిగే అవకాశమున్నది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి మీ జీవితంలో చాల సమస్యలు తొలగి పోయే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో చదివిన చదువుకు తగిన ఫలితం రాకపోవటంతో కొంత నిరాశకు, నిరుత్సాహానికి గురవుతారు. చదువు మీద ఆసక్తి తగ్గటం కానీ, ఇతర విషయాల మీద ఆసక్తి పెరగటం కానీ జరుగుతుంది. అక్టోబర్ నుంచి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. చదువు మీద శ్రద్ధ, ఏకాగ్రత పెరగటమే కాకుండా చదువు విషయంలో ఉన్న ఆటంకాలు తొలగి పోతాయి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితం వస్తుంది.

పరిహారాలు

ఈ సంవత్సరం ప్రధానంగా గురువుకు, రాహువుకు పరిహారాలు చేయటం మంచిది. అక్టోబర్ వరకు గురువు అనుకూలంగా ఉండదు కాబట్టి గురు స్తోత్ర పారాయణం కానీ, గురు మంత్రం జపం చేయటం కానీ మంచిది. అలాగే పంచమంలో రాహువు విద్యలో ఆటంకాలు కల్పిస్తాడు కాబట్టి రాహు పూజ కానీ జపం కానీ చేయటం మంచిది. లేదా ప్రతి రోజు దుర్గ స్తోత్ర పారాయణం చేయటం మంచిది.

No comments:

Post a Comment