Friday 6 April 2018

మేష రాశి ఫలితములు

మేష రాశి ఫలితములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Mesha Rashiphal (Rashifal) for Vijaya telugu year
అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా) 
భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)
మేష రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం గురువు సప్తమ స్థానంలో, తులా రాశిలో అక్టోబర్ 11 వరకు అనుకూలుడుగా సంచరిస్తాడు ఆ తర్వాత అష్టమ స్థానమైన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. శని సంవత్సరమంతా నవమ స్థానమైన ధనూ రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం చివరి వరకు చతుర్థ స్థానమైన కర్కాటక రాశిలో, కేతువు దశమస్థానమైన మకర రాశిలో సంచరిస్తాడు.

ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోంది

మేష రాశి వారికీ ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ వృత్తిలో కొన్ని ప్రతికూలాలు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ గురువు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉండటం వలన సమస్యల నుంచి తొందరగానే బయట పడతారు. వివాహం కానీ వారికీ ఈ సంవత్సరం వివాహ యోగం ఉంటుంది. కోర్టు కేసులు కానీ, భాగస్వామ్య వివాదాలు కాని పరిష్కారం అవుతాయి. అతిగా ఆశించటం, ఊహించటం చేయకండి అది మీకు కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది.

ఆరోగ్యం

ఈ సంవత్సరం ఆరోగ్యం కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అంతగా ఇబ్బందులు ఉండవు. అయితే అక్టోబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా లేక పోవటం అలాగే రాహు గోచారం సంవత్సరమంతా అనుకూలంగా లేక పోవటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, నరాలు మెడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ ఎక్కువగా బాధించే అవకాశమున్నది. అలాగే కాలేయ సంబంధ మరియు వెన్నెముక సంబంధ అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశమున్నది.

ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం మీ వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయి. గురు, శనుల గోచారం మీకు వృత్తిలో మార్పును, విదేశియానాన్ని ఇస్తుంది. వృత్తిలో జరిగే మార్పులు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి వాటి గురించి బాధపడే అవసరం లేదు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఉంటుంది. విదేశియానానికి సంబంధించి కూడా అనుకూల ఫలితాలు చోటుచేసుకుంటాయి. విదేశాల్లో స్థిర నివాసం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం లో అనుకూల ఫలితాలు కలుగుతాయి. అయితే రాహు గోచారం అనుకూలంగా లేక పోవటం వలన పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అవటం కానీ, ఇష్టం లేని బాధ్యతలు చేపట్టాల్సి రావటం కానీ జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సర ప్రథమార్థం చాల అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునే వారికీ అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు పెట్టుబడులు పెట్టాలనుకునే వారు అక్టోబర్ లోపు చేయటం మంచిది. అక్టోబర్ నుంచి గురు, రాహువులు అనుకూలంగా ఉండరు కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బులు రావటం, పెట్టుబడులు మంచి రాబడి ఇవ్వటం జరుగుతుంది. అయితే అక్టోబర్ తర్వాత నుంచి పరిస్థితులు మారతాయి. ఖర్చులు పెరగటం, లాభాలు తగ్గటం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, కొనుగోళ్ల విషయంలో అక్టోబర్ తర్వాత నుంచి జాగ్రత్త అవసరం.

కుటుంబం

ఈ సంవత్సరం కుటుంబ జీవితం విషయంలో అనుకూలంగా ఉంటుంది. వివాహం కానీ వారికీ ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. మీ మధ్య ఉన్న మనస్పర్థలు దూరం అవుతాయి. సంఘంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అక్టోబర్ తర్వాత గోచారం కొంత అనుకూలంగా ఉండదు కాబట్టి మీ కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ సంతానం మంచి వృద్ధిలోకి వస్తారు. వారి గురించి డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. అలాగే సంతానం కానీ వారికీ ఈ సంవత్సరం అక్టోబర్ లోపు సంతానం అయ్యే అవకాశం ఉంటుంది.

చదువు

ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన విద్యలో రాణిస్తారు. అయితే రాహు గోచారం విద్య స్థానమైన నాలగవ ఇంట ఉండటం వలన చదువు విషయంలో కొంత ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. తల్లిదండ్రులు మేష రాశిలో జన్మించిన తమ పిల్లల మీద ఒత్తిడి ఎక్కువ పెట్టకుండా వారికి సరైన ప్రోత్సాహం ఇస్తూ వారి నిరాసక్తతను దూరం చేయటం మంచిది. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత నుంచి గురు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి విద్యార్థులు కొంత మానసిక ఒత్తిడికి, చదువు పట్ల నిరాసక్తతకు గురయ్యే అవకాశం ఉంటుంది. వారు అనుకున్న రంగంలో ప్రవేశం లభించటానికి కొంచెం ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. దాని కారణంగా విద్యలో మంచి అభివృద్ధిని సాధించటమే కాకుండా, ఆరోగ్యంగా కూడా ఉంటారు.

పరిహారాలు

మేష రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం గురువుకు మరియు రాహువుకు పరిహారాలు చేసుకోవటం మంచిది. నాలగవ ఇంట రాహు గోచారం ఒత్తిడిని పెంచేదిగా, ఆరోగ్య సమస్యలు ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి రాహు పూజ కానీ, దుర్గ పూజ కానీ చేసుకోవటం అలాగే మినుములు దానం చేయటం మంచిది. అక్టోబర్ తర్వాత గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి గురు పూజ చేసుకోవటం, శనగలు దానం చేయటం మంచిది.

No comments:

Post a Comment