Friday 6 April 2018

తులా రాశిఫలములు

తులా రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

తులారాశి జయ రాశి ఫలాలు
చిత్త 3, 4 పాదాలు (ర,రి),
స్వాతి నాలుగు పాదాలు (రు, రె, రో,త),
విశాఖ 1, 2, 3 పాదాలు (తి, తు, తే)
తులా రాశి వారికి ఈ సంవత్సరం గురువు జన్మస్థానమైన తుల రాశిలో అక్టోబర్ దాక సంచరిస్తాడు. ఆ తర్వాత రెండవ ఇంట వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. శని సంవత్సరమంతా ధను రాశిలో, మూడవ ఇంట సంచరిస్తాడు. రాహువు పదవ ఇంట కర్కాటక రాశిలో, కేతువు నాలగవ ఇంట మకర రాశిలో సంవత్సరం చివరి వరకు సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ విలంబి నామ సంవత్సరం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. అక్టోబర్ వరకు గురు గోచారం సామాన్యంగా ఉన్నప్పటికీ, శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కొన్ని అనుకోని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కుంటారు. కుటుంబ పరంగా ఈ సంవత్సరం ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది

ఆరోగ్యం

ఈ సంవత్సరం గురు గోచారం అక్టోబర్ వరకు జన్మ రాశిలో ఉండటం వలన ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. మిగతా గ్రహాల గోచారం అనుకూలంగా ఉండటం అలాగే అక్టోబర్ నుంచి గురు గోచారం కూడా అనుకూలంగా మారటం వలన ఆరోగ్యం విషయంలో అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు గోచారం అనుకూలంగా లేని సమయంలో కాలేయ సంబంధ సమస్యలు, నడుము, వెన్ను నొప్పి సంబంధ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశమున్నది. అలాగే కేతు గోచారం నాలగవ ఇంట మంచిది కాదు కాబట్టి చర్మ సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశమున్నది. శని గోచారం సంవత్సరమంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినా అవి కొంత కలం వరకే ఇబ్బంది పెడతాయి. మిగతా సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉంటారు.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఉద్యోగులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండటం, అక్టోబర్ నుంచి గురు గోచారం కూడా అనుకూలంగా మారుతుంది కాబట్టి ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. పదోన్నతి కొరకు లేదా ఉద్యోగంలో మంచి మార్పు కొరకు ఎదురు చూస్తున్న వారికీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ప్రతిభకు, పనికి గుర్తింపు లభిస్తుంది. దశమ స్థానంలో రాహువు అనుకూల ఫలితాలను ఇస్తాడు కానీ అదే సమయంలో పని పట్ల మీకు కొంత నిర్లక్ష్యాన్ని, అహంకారాన్ని ఇస్తాడు. బాధ్యతల విషయంలో ఎత్తి పరిస్థితిలో నిర్లక్ష్యానికి చోటు ఇవ్వకండి అది మీ వృత్తి మీద, మీ జీవన విధానం మీద ప్రభావం చూపే అవకాశమున్నది. దాని కారణంగా మీ వృత్తిలో అనుకోని మార్పులు చోటు చేసుకోవటం కానీ, శత్రువులు పెరగటం కానీ జరగవచ్చు. అలాగే జన్మ స్థానంలో గురు గోచారం ఉన్నంత వరకు మీ ఉద్యోగ విషయంలో ఎదో ఒక సమస్య లేదా భయం మిమ్మల్ని పీడిస్తుంది. దాని కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారు ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత మారటం మంచిది. అక్టోబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీ పై అధికారుల మన్ననలు, గుర్తింపు లభిస్తుంది. చాలాకాలం నుంచి వాయిదా పడుతున్న పదోన్నతి కానీ, అనుకూల మార్పు కానీ చోటు చేసుకుంటుంది.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ప్రథమార్థంలో కొంత సామాన్య ఫలితాలను చూసినా ద్వితీయార్థంలో మాత్రం అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. రాహు గోచారం మీ వ్యాపారానికి మంచి ప్రచారాన్ని, నమ్మకాన్ని తెచ్చి పెడుతుంది. అయితే అత్యుత్సాహానికి పోయి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ చేయకండి, ముఖ్యంగా అక్టోబర్ వరకు ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మీతో పెట్టుబడి పెట్టించటం కానీ, మోసం చేయటం కానీ జరుగుతుంది. చెప్పుడు మాటలకూ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకండి.
ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థం లో కొంత ఖర్చులు పెరిగిన, అక్టోబర్ తర్వాత నుంచి ఆదాయం పెరగటం ఖర్చులు కూడా తక్కువ అవటం వలన ఆర్థిక సమస్యలు తొలగి పోవటమే కాకుండా, గృహ, వాహనాది సౌకర్యాలను కూడా కొనుగోలు చేస్తారు. చతురత స్థానంలో కేతు గోచారం కారణంగా ప్రథమార్థంలో గృహ సంబంధ విషయాలకు లేదా ఆరోగ్య సంబంధ విషయాలకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. అక్టోబర్ తర్వాత ఖర్చులు అదుపులోకి వస్తాయి, దయం కూడా పెరుగుతుంది.

కుటుంబం

కుటుంబం పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థం కొన్ని సమస్యలను ఎదుర్కొన్న, ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలను పొందుతారు. అక్టోబర్ లోపు మీ తప్పుడు నిర్ణయాలు లేదా కోపం కారణంగా మీ కుటుంబ సభ్యులు కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశమున్నది. అలాగే బాధ్యతలు తీసుకొని తర్వాత వాటిని మరిచిపోవటం లేదా నిర్లక్ష్యం చేయటం వలన కూడా కొంత ఇబ్బందులు మనస్పర్థలు ఎదురవుతాయి. అయితే అక్టోబర్ నుంచి అన్ని సమస్యలు, అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అక్టోబర్ తర్వాత కుటుంబంలో వివాహం కానీ, సంతానం కానీ లేదా ఏదైనా శుభకార్యం కానీ జరిగే అవకాశమున్నది. మీ సంతానం కూడా మంచి అభివృద్ధి లోకి వస్తారు. చతుర్థ స్థానంలో కేతు గోచారం కారణంగా కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళనను కలిగిస్తుంది. అయితే అక్టోబర్ తర్వాత ఆరోగ్య సమస్యలు తొలగి పోతాయి. మీ వైవహిక జివితం కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి విదేశీయానం కానీ, వినోదయాత్రలు కానీ చేస్తారు.

చదువు

ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చదువు పట్ల శ్రద్ధ పెరగటమే కాకుండా, మంచి గుర్తింపుని కూడా పొందుతారు. ఉన్నత విద్య ప్రయత్నాలు చేస్తున్న వారు కానీ, విదేశాల్లో చదవాలని ప్రయత్నాలు చేస్తున్న వారు కానీ ఈ సంవత్సరం అనుకూల ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి విద్యార్థులకు అన్ని రకాలుగా కలిసి వచ్చే సమయం. అయితే నాలుగవ ఇంట కేతు గోచారం కొంత భయాన్ని, బద్దకాన్ని ఇచ్చే అవకాశముంటుంది.

పరిహారాలు

ఈ సంవత్సరం అక్టోబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి గురువుకు, అలాగే చతుర్థ స్థానంలో కేతు గోచారం మంచిది కాదు కాబట్టి కేతువుకు పరికరాలు చేసుకోవటం మంచిది. దీనికి గాను గురు, కేతువుల మంత్రం జపం కానీ, స్తోత్ర పారాయణం చేయటం కానీ చేయాలి. ప్రత్యామ్నాయంగా గణేశ స్తోత్రం చదవటం కానీ, గురు చరిత్ర పారాయణం చేయటం కానీ చేయాలి.

No comments:

Post a Comment