Friday 6 April 2018

ధనుస్సు రాశిఫలములు

ధనుస్సు రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Kanya rashi telugu year predictions
మూల 4 పాదములు (యె, యో, బ, బి)
పూర్వాషాఢ 4 పాదములు (బు, ధ, భ, ఢ)
ఉత్తరాషాఢ 1వ పాదం (బె)
ఈ సంవత్సరం ధనూ రాశి వారికి గురువు అక్టోబర్ వరకు పదకొండవ ఇంట, తులా రాశిలో సంచరిస్తాడు, ఆ తర్వాత పన్నెండవ ఇంట, వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. శని సంవత్సరమంతా జన్మ రాశియైన ధనూ రాశిలో సంచరిస్తాడు. రాహువు, అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో, కేతువు ధన స్థానంలో మకర రాశిలో సంవత్సరం చివరి వరకు సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ సంవత్సరం మీకు ప్రథమార్థం చాల అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. ద్వితీయార్థంలో ఖర్చులు పెరగటం, స్థానచలనం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు మొదలైన ఫలితాలుంటాయి.

ఆరోగ్యం

ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ప్రథమార్థం అక్టోబర్ వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, ఆరోగ్యం మెరుగుపడటం జరుగుతుంది. జన్మాన శని, అష్టమాన రాహువు ఉన్నప్పటికీ, రాశ్యధిపతి గురువు పదకొండింట సంచరించటం వలన చాల వరకు ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అయితే అక్టోబర్ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గటం, చర్మ వ్యాధులు, గ్యాస్త్రిక్ సమస్యలు, మెడ నొప్పులు పెరగటం ఎముకల సంబంధ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవటం జరుగుతుంది. సరైన ఆహారం తీసుకోవటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం, శారీరక వ్యాయామం చేయటం వలన కొంతవరకు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు, ఉద్యోగంలో ఉన్నతి సాధించటం జరుగుతుంది. గురు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉండటంతో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. మీ పై అధికారుల అండ వలన పదోన్నతిని పొందుతారు. అయితే శని దృష్టి సప్తమ స్థానంపై ఉండటం, రాహు గోచారం కూడా అనుకూలంగా లేక పోవటం వలన మీకు అంతర్గత శత్రువులు, మీరు అంటే అసూయ కలవారు పెరిగే అవకాశమున్నది. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా ద్వితీయార్థంలో మీ పనులు చేసి పెడతామని చెప్పి మీకు చెడ్డ పేరు తీసుకురావటానికి ప్రయత్నించే వారు పెరుగుతారు.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొంత సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో మంచి లాభాలు వచ్చి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఈ సంవత్సరం అక్టోబర్ లోపు ప్రారంభించటం మంచిది. గురు బలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ద్వితీయార్థంలో వ్యాపారంలో, ఆర్థిక స్థితిలో మార్పులు చోటు చేసుకుంటాయి. గురువు వ్యయ స్థానంలో సంచరించటం వలన ఖర్చులు పెరుగుతాయి. పెట్టిన పెట్టుబడులనుంచి సరైన లాభాలు రావు. వచ్చే లాభాలు కూడా ఎన్నో ఆటంకాలతో వస్తాయి. సప్తమ స్థానం మీద శని దృష్టి ఉండటం వలన వ్యాపారం మందకొడిగా సాగుతుంది. రాహు గోచారం కూడా అనుకూలంగా లేక పోవటం వలన శత్రుభయం, పోటీ పెరగటం జరుగుతుంది.
ఆర్థికంగా ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో మంచి ధనా దాయం ఉంటే ద్వితీయార్థంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. వెనక ముందు చూడక డబ్బు ఖర్చు చేయటం వలన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. గురువు అనుకూలంగా ఉన్న సమయంలో డబ్బు పొదుపు చేసినట్లయితే గురువు అనుకూలంగా లేని సమయంలో ఆ డబ్బు ఉపయోగ పడుతుంది. తొందరపాటుకు, అత్యుత్సాహానికి పోయి అనవసరమైన ఖర్చులు పైన వేసుకోకండి.

కుటుంబం

ఈ సంవత్సరం కుటుంబపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. అక్టోబర్ వరకు గురు బలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో శుభకార్యాలు జరగటం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగటం జరుగుతుంది. అలాగే మీ మిత్రులు లేదా తోబుట్టిన వారి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. వారి సహాయంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. పంచమ స్థానంపై గురు దృష్టి కారణంగా సంతానం బాగా అభివృద్దిలోకి వస్తుంది. సంతానం కానీ వారికీ సంతానం అయ్యే అవకాశముంటుంది. అక్టోబర్ తర్వాత పరిస్థితులలో మార్పులు వస్తాయి. భార్య భర్తల మధ్య గొడవలు అపోహలు పెరగటం జరుగుతుంది. శని దృష్టి తృతీయ స్థానంపై ఉండటంలో మీ కంటే చిన్న వారితో లేదా ఇరుగుపొరుగు వారితో అనవసరమైన గొడవలు ఏర్పడతాయి. కొంతకాలం కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావచ్చు. శని జన్మ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి బద్ధకం, అనుమానాలు పెరిగే అవకాశముంటుంది. దాని కారణంగా కుటుంబ సభ్యులకు, మీకు మధ్యన దూరం పెరుగుతుంది. అలాగే రాహు గోచారం అనుకూలంగా లేక పోవటం వలన మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ, కొంత కాలం మీకు దూరంగా ఉండాల్సి రావటం కానీ జరుగుతుంది.

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్థంలో చదువు విషయంలో బాగా రాణిస్తారు. పడిన కష్టానికి రెట్టింపు ఫలితం పొందుతారు. ఉన్నతవిద్య విదేశాల్లో చేయాలనుకునే వారికీ ఈ సంవత్సరం కలిసి వస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అక్టోబర్ తర్వాత పరిస్థితులు మారతాయి. శని జన్మస్థానంలో గోచారం కారణంగా బద్ధకం పెరుగుతుంది. ప్రతి దాన్ని ప్రశ్నించటం, సాగదీయటం చేస్తారు. దాని వలన చదువు మీద శ్రద్ధ తగ్గటం జరుగుతుంది. లేని భయాలను, వైఫల్యాలను ఊహించుకొని అసలు చేయాల్సిన పనులను, చదువును వాయిదా వేస్తుంటారు. తల్లిదండ్రులు వారికీ సరైన మార్గం చూపించి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేయటం మంచిది.

పరిహారాలు

ఈ సంవత్సరం శని, రాహు మరియు గురు గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది. ఈ గ్రహాల మంత్రం జపం చేయటం కానీ, స్తోత్ర పారాయణం ప్రతిరోజూ చేయటం కానీ మంచిది. దీని వలన బద్ధకం, ఆటంకాలు తొలగిపోతాయి. ప్రత్యామ్నాయంగా ప్రతి రోజు హనుమాన్, దుర్గ మరియు గురు సంబంధ స్తోత్రాలు పారాయణం చేయటం మంచిది.

No comments:

Post a Comment