Friday 6 April 2018

వృషభ రాశి రాశిఫలములు

వృషభ రాశి రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

vrishabha rashi telugu predictions vijaya telugu year
 కృత్తిక నక్షత్రం 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ) రోహిణి నక్షత్రం 1,2,3,4 పాదములు,(ఓ,వా,వీ,వూ) , మృగశిర నక్షత్రం 1,2 పాదములలో (వే,వో) జన్మించిన వారు వృషభ రాశి జాతకులు
వృషభ రాశి వారికీ ఈ సంవత్సరం గురువు అరవ భావం అయిన తుల రాశి లో అక్టోబర్ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత ఏడవ భావమైన వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. శని సంవత్సరమంతా ఎనిమిదవ భావంలో ధను రాశిలో సంచరిస్తాడు. రాహువు మూడవ భావమైన కర్కాటక రాశిలో, కేతువు తొమ్మిదవ భావమైన మకర రాశిలో ఈ సంవత్సరం చివరి వరకు సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉంటుంది

వృషభ రాశి వారికీ ఈ విలంబి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వృత్తిలో అక్టోబర్ వరకు చెప్పుకోదగిన అభివృద్ధి ఉండదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేపట్టిన పనులు వాయిదా పడటం లేదా ఎక్కువ శ్రమతో పూర్తవటం జరుగుతుంది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. మీరు చెప్పే మాటలు, ఇచ్చే సలహాలు కొన్ని సందర్భాలలో మీకే ఇబ్బంది తెచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ప్రథమార్థం సామాన్యంగా, ద్వితియార్థం అనుకూలంగా ఉంటుంది. రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చిన ఎదుర్కునే ధైర్యం, మొండితనం మిమ్మల్ని కాపాడుతుంది.

ఆరోగ్యం

ఈ సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా లేక పోవటం, అక్టోబర్ వరకు గురు గోచారం కూడా అనుకూలంగా లేక పోవటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. గొంతు, ఎముకలు, కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు మిమ్మల్ని బాధిస్తాయి. అలాగే దంత సమస్యలు, హృదయ, రక్త సంబంధ ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉన్నది. అయితే అక్టోబర్ నుంచి గురువు అనుకూల గోచారం కారణంగా, రాహువు కూడా మూడవ ఇంట అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శని అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, మీ రాశివారికి యోగ కారక గ్రహం కాబట్టి సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి కలిగి ఉంటారు.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్ధిక స్థితి

ఈ సంవత్సరం అక్టోబర్ వరకు గురు, శనుల గోచారం అనుకూలంగా లేని కారణంగా వృత్తిలో మీకు అనుకోని సమస్యలను, మార్పులను ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ స్థాయి తగ్గి పనిచేయాల్సిన సందర్భాలు వస్తాయి. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తి కావు. మీ శ్రమకు తగిన ఫలితం రాకపోవటమే కాకుండా మీకు రావలసిన పేరు రాకుండా మీ సహోద్యోగులు కానీ పై అధికారులు కానీ అడ్డుపడతారు. ఈ సమయం మీరు కొత్త విషయాలు నేర్చుకునేదిగా భావించాలి తప్ప నిరాశకు గురి కాకూడదు. ఇక్కడ వచ్చిన ప్రతి సమస్య మీ భవిష్యత్తుకు ఉపయోగపడేదిగా ఉంటుంది తప్ప మీకు నష్టం చేసేవిగా ఉండవు. అక్టోబర్ నుంచి గురువు అనుకూల గోచారం కారణంగా మీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తిలో అభివృద్ధి సాధ్యం అవుతుంది. అనుకున్న చోటికి బదిలీ అవటం కానీ, విదేశీయానం కానీ చేస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
వ్యాపారంలో ఈ సంవత్సరం ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది. చాల అవకాశాలు వచ్చినట్టే వచ్చే చేజారతాయి. పెట్టిన పెట్టుబడుల నుంచి ఆదాయం రాకుండా అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు అక్టోబర్ వరకు ఆగటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ప్రతి చిన్నదానికి భాగస్వాముల మీద ఆధారపడకుండా ఉండటం మంచిది
ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండటం, డబ్బు నష్టపోవటం కారణంగా కొంత ఇబ్బందికి గురవుతారు. అక్టోబర్ నుంచి గురువు అనుకూలంగా రావటంతో ఆర్ధిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. రావలసిన డబ్బు తిరిగి రావటం, పెట్టుబడుల నుంచి లాభాలు రావటం వలన కొంత ఉపశమనం లభిస్తుంది.

కుటుంబం

ఈ సంవత్సరం అక్టోబర్ వరకు కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలుంటాయి. గురు, శనుల గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉందని కారణంగా కుటుంబ సభ్యులతో మనస్పర్థలు ఏర్పడటం లేదా వారికీ దూరంగా ఉండాల్సి రావటం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళనకు గురవుతారు. మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, మనస్పర్థలు ఏర్పడతాయి. అక్టోబర్ లో గురువు సప్తమ స్థానంలో అనుకూల సంచారం కారణంగా మీ కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థం లో వివాహ యోగం ఉంటుంది. అలాగే సంతానం గురించి ఎదురు చూస్తున్నవారికి కూడా ఈ సంవత్సరం అనుకూల ఫలితం ఉంటుంది. మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. మీ బంధువులు లేదా చుట్టుపక్కల వారి కారణంగా కొన్ని సమస్యలు, మనస్పర్థలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారితో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం.

విద్యార్థులు

విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ అక్టోబర్ నుంచి అన్ని విధాలుగా కలిసొచ్చే సమయం ఆరంభం అవుతుంది. అక్టోబర్ వరకు మాత్రం చదువు విషయంలో కొంచెం శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది. రాహువు గోచారం మూడవ ఇంట అనుకూలంగా ఉండటం మంచిదే అయినప్పటికీ రాహువు కొంత తొందరపాటును, అహంకారాన్ని ఇస్తాడు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త అవసరం. నిర్లక్ష్యాన్ని, అజాగ్రత్తను వదిలి చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. శని అష్టమ స్థానం లో గోచారం కొన్ని ఆటంకాలను సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి, విద్యార్థులు ఏ పని అయిన పట్టువదలక కృషిచేస్తే అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతారు.

చేయవలసిన పరిహారాలు

ఈ సంవత్సరం ప్రధానంగా శని అనుకూలంగా ఉండదు కాబట్టి శనికి పరిహారాలు చేయటం మంచిది. అలాగే కేతువు తొమ్మిదవ ఇంట గోచారం ఉన్నతవిద్య విషయంలో ఆటంకాలను ఇస్తుంది కాబట్టి కేతువుకు కూడా పరిహారాలు చేయటం మంచిది. శని మరియు కేతువులకు జపం చేయటం లేదా స్తోత్ర పారాయణం చేయటం లేదా హనుమాన్ మరియు గణేశ మంత్రాలను స్తోత్రాలను చదవటం వలన ఏకాగ్రత పెరగటమే కాకుండా చదువు విషయంలో పట్టుదల కూడా పెరుగుతుంది.

No comments:

Post a Comment