Friday 6 April 2018

సింహ రాశిఫలములు

సింహ రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

సింహ రాశి తెలుగు Telugu Rashiphal
మఖ 4 పాదాలు (మ, మి, ము, మే),
పుబ్బ 4 పాదాలు (మో, ట, టి, టు)
ఉత్తర 1వ పాదం (టె)
ఈ సంవత్సరం సింహ రాశి వారికి గురువు అక్టోబర్ వరకు మూడవ ఇంటిలో తుల రాశిలో, ఆ తర్వాత నాలగవ ఇంటిలో వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. శని సంవత్సరమంతా ఐదవ ఇంట్లో, ధనూ రాశిలో సంచరిస్తాడు. రాహువు పన్నెండవ ఇంట, కర్కాటక రాశిలో, కేతువు ఆరవ ఇంట మకర రాశిలో సంవత్సరం చివరి వరకు సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఆచరణ రూపంలోకి రాకముందే అడ్డంకులు ఎక్కువగా కలుగుతాయి. మీ ఆలోచనలను వ్యతిరేకించేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. మీరిచ్చిన సలహాలు పాటించి తర్వాత మిమ్మల్నే మాట అనే వారు ఎక్కువ అవుతారు. అలాగే మిత్రులతో దగ్గరి వారితో అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి. ఆర్థిక విషయాలలో కూడా అనుకోని సమస్యలు వచ్చే అవకాశముంటుంది. ఈ సంవత్సరం మీ మానసిక స్థైర్యానికి పరీక్ష లాంటిది. ఈ సమయాన్ని ఎంత బాగా ఎదుర్కుంటే మీకు విజయాలు అంత ఎక్కువగా వస్తాయి.

ఆరోగ్యం

ఈ సంవత్సరం చివరి వరకు రాహు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మెడ నొప్పులు, గాస్త్రిక్ సమస్యలు అలాగే మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మీ ఆరోగ్యసమస్యలకు మీ మానసిక ఆందోళన కారణం అవుతుంది. లేని సమస్యను, వ్యాధులను ఉన్నట్టు ఊహించుకొని భయపడటం ఎక్కువ అవుతుంది. నిజానికి మీకు ఈ సంవత్సరం శారీరక ఆరోగ్యసమస్యలు ఎక్కువగా లేక పోయినప్పటికీ మానసికంగా ఏదో సమస్య ఉన్నట్టు ఊహించుకోవటం వలన ఎక్కువ బాధ పడతారు. ఈ సంవత్సరం మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం ప్రథమార్థంలో వృత్తిలో కానీ చేసే ప్రదేశంలో కానీ మార్పులు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి దూర ప్రాంతానికి కానీ, విదేశాలకు కానీ బదిలీ అయ్యే అవకాశమున్నది. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. పంచమ స్థానంలో శని సంచారం కారణంగా మీ సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు తక్కువగా అందుతాయి. అయితే మీ పట్టుదల, మీ నైపుణ్యం మిమ్మల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయి. ఎవరి సహకారం లేకున్నా మీ కష్టంలో చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆవేశానికో లేక పట్టుదలకో పోయి అదనపు పనులకు బాధ్యతలకు ఒప్పుకోకండి అది మీకు లేని సమస్యలను తెచ్చి పెడుతుంది. మిమ్మల్ని ప్రేరేపించి మీతో పనులు చేయించుకునే వారు ఎక్కువగా ఉంటారు అలంటి వారి విషయంలో జాగ్రత్త అవసరం. వారి కారణంగా మీ పనులు చెడి పోవటమే కాకుండా మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశముంటుంది. ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్న వారు మంచి అవకాశం అయినప్పుడు మారటం మంచిది. ఈ విషయంలో రిస్క్ చేయటం అంతగా అనుకూలం కాదు. విదేశాల్లో ఉన్నవారు కూడా వీసా విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ నిర్లక్ష్యం మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మాధ్యమంగా అనుకూలిస్తుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించినప్పటికీ అప్పుడప్పుడు అనుకోని ఇబ్బందులు, నష్టాలూ ఎదురయ్యే అవకాశముంటుంది. మీ గురించి, మీ వ్యాపారం గురించి చేదుగా ప్రచారం చేసే వారు ఎక్కువ అవుతారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త అవసరం. మిమ్మల్ని పొగడ్తలతో ముంచి అలాగే మీకు అవసరం లేని పెట్టుబడులు పెట్టించే వారు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటారు. ఏ విషయంలో అయిన ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయటం మంచిది. అక్టోబర్ తర్వాత గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆలోపే మీరు వ్యాపార విషయంలో చేయాల్సిన పనులు చేయటం మంచిది.
ఈ సంవత్సరం ఆర్థిక స్థితి బాగానే ఉన్నప్పటికీ, అనవసరమైన ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెట్టుబడులు, కొనుగోళ్ల విషయంలో జాగ్రత్త అవసరం. మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కుటుంబం

ఈ సంవత్సరం ప్రథమార్థంలో కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమాభిమానాలు పెరగటం. గొడవలు, మనస్పర్థలు సమసిపోవటం జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో వివాహం కానీ, సంతానం అవటం కానీ జరుగుతుంది. మీకు అనుకూలంగా లేని సమయంలో మీ కుటుంబ సభ్యులే మీకు పెద్ద అండగా ఉంటారు. శని పంచమ స్థానంలో గోచారం కారణంగా మీ సంతానంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు కానీ వేరే సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. మీ బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా అనుకుంటారు. అక్టోబర్ తర్వాత గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల విషయంలో అపోహలకు, ఆవేశాలకు లోను కాకుండా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉంటె చాల వరకు సమస్యలు దూరం అవుతాయి. రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి మీకు ప్రతి చిన్న విషయానికే ఆవేశం పెరిగే అవకాశమున్నది. కొంత ఓపికను అలవారచుకోవటం అలాగే ఏ నిర్ణయమైన కొంత సమయం తీసుకొని తీసుకోవటం వలన కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది.

చదువు

ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహు గోచారం సంవత్సరమంతా అనుకూలంగా లేక పోవటం వలన చదువు విషయంలో నిరాశకు, అనాసక్తికి గురవుతారు. అనవసరమైన భయాలు పెట్టుకొని చదువు మీద శ్రద్ద తగ్గించుకునే అవకాశముంటుంది. వారికి ధైర్యాన్ని, ఆసక్తిని పెంపొందించేలా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించటం మంచిది. ద్వితీయార్థంలో గురు గోచారం కూడా అనుకూలంగా ఉండక పోవటం వలన బద్ధకం పెరగటం చిన్న పనికే ఎక్కువ అలసిపోవటం జరుగుతుంది. అయితే కేతు గోచారం అనుకూలంగా ఉండటం వలన పరీక్షలలో అనుకున్న ఫలితాలు రావటం వలన కొంత సహాయకారిగా ఉంటుంది. విదేశాల్లో చదవాలనుకునే వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలు

ఈ సంవత్సరం ప్రధానంగా గురు, రాహు గ్రహాలు అనుకూలంగా ఉండవు కాబట్టి ఈ రెండు గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది. దీనికిగాను గురు రాహు గ్రహాల జపం చేయటం కానీ, స్తోత్ర పారాయణం చేయటం కానీ చేయాలి. లేదా గురు చరిత్ర పారాయణం, దుర్గ స్తోత్ర పారాయణం చేయటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

No comments:

Post a Comment