Friday 6 April 2018

కన్య రాశిఫలములు

కన్య రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Kanya rashi telugu year predictions
ఉత్తర 2,3, 4 పాదాలు (టొ, ప, పి)
హస్త 4 పాదాలు (పు, షం, ణ, ఠ)
చిత్త 1,2 పాదాలు (పె, పొ)
ఈ సంవత్సరం కన్య రాశి వారికి గురువు రెండవ ఇంట తుల రాశిలో అక్టోబర్ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత మూడవ ఇంటికి మారతాడు. శని సంవత్సరమంతా నాలగవ ఇంట ధనూ రాశిలో సంచరిస్తాడు. రాహువు పదకొండింట, కర్కాటక రాశిలో సంవత్సరాంతం వరకు సంచరిస్తాడు. కేతువు మకర రాశిలో, పంచమ స్థానంలో సంవత్సరాంతం వరకు సంచరిస్తాడు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ సంవత్సరం ఆర్థికంగా, కుటుంబం పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్రుత్తి పరంగా ఒత్తిడి, మర్పూ ఉంటాయి. నివాస స్థలంలో మార్పు ఉంటుంది. గురు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే మీ కుటుంబ సహాయ సహకారాలు ఉంటాయి.రాహు గోచారం లభాస్తానంలో ఉండటం ములన మీరు చాల కాలంగా ఎదురు చూస్తున్న పనులు, కోరికలు అనుకూలమైన ఫలితాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. శని గోచారం పని ఒత్తిడిని పెంచుతుంది అలాగే మార్పులను ఇస్తుంది.

ఆరోగ్యం

ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థం అనుకూలంగా ఉంటే ద్వితీయార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. గురు గోచారం అక్టోబర్ వరకు, రాహు గోచారం సంవత్సరాంతం వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత కొంత కాలంగా మిమ్మల్ని బాధిస్తున్న ఆరోగ్య సమస్యలు తొలగి పోవటమే కాకుండా మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. అయితే శని గోచారం నాలగవ ఇంట అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంటుంది. ముఖ్యంగా ఎముకలు, ఊపిరితిత్తులు మరియు మోకాళ్లకు సంబంధించిన ఆరోగ్యసమస్యలు ఎక్కువగా ఉండే అవకాశమున్నది. అలాగే గాస్త్రిక్ సంబంధ సమస్యలు కూడా మిమ్మల్ని బాధిస్తాయి. సరైన ఆహార అలవాట్లు కలిగి ఉండటం, సమయానుకూల విశ్రాంతి వలన చాల వరకు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే పంచమ స్థానంలో కేతు గోచారం గుండె దడ అనవసర భయాలను, ఆందోళనలను ఇస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించటం, ప్రతి చిన్న దానికి ఎక్కువ ఆందోళన పడకుండా ఉండటం మంచిది.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఉద్యోగ విషయంలో ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే వృత్తిలో ఒత్తిడి, కొత్త సవాళ్లు ఎదురవుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేయటంలో ఆటంకాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. చిన్న పని కూడా ఎక్కువ శ్రమతో పూర్తి చేయాల్సి వస్తుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఈ సమయం ఎంతగానో సహాయపడుతుంది. గురు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృత్తిలో గుర్తింపు, ప్రమోషన్ లేదా పురస్కారాలు లభిస్తాయి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ సహోద్యోగుల, మిత్రుల సహకారంతో ఒత్తిడిని ఎదుర్కొన గలుగుతారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వృత్తిలో కానీ, నివాస స్థలం లో కానీ మార్పులు ఉంటాయి. కొందరి విదేశీయాన ప్రాప్తి కూడా ఉంటుంది. రాహు గోచారం సంవత్సరాంతం వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృత్తి పరంగా చాల విషయాల్లో మీది పై చేయిగా ఉంటుంది. కానీ కొంత అహంకారం కానీ, తొందరపాటు కానీ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి విజయాలకు పొంగి పోకుండా, అపజయాలకు కుంగి పోకుండా పని మీద దృష్టి పెట్టడం మంచిది.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పెట్టున పెట్టుబడులకు మంచి లాభాలు రావటమే కాకుండా చాల కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు కూడా దూరం అవుతాయి. దాని వలన వ్యాపారం అభివృద్ధి చెందటమే కాకుండా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మీ వ్యాపారానికి, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. ద్వితీయార్థంలో వ్యాపార స్థలంలో కానీ, వ్యాపార ఒప్పందాలలో కానీ అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే పని ఒత్తిడి కొంత పెరుగుతుంది. అలాగే ఆదాయం కొంత తగ్గటం కానీ పెట్టుబడులు పెరగటం కానీ జరుగుతుంది.
ఆర్థికంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో గురు, రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే మీకు రావలసిన బకాయిలు వసూలవటం కానీ, బ్యాంక్ లోను లభించటం కానీ జరుగుతుంది. కొత్తగా భూమి లేదా గృహ సంబంధ కొనుగోళ్లకు అక్టోబర్ వరకు సమయం చాల అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత చేసే కొనుగోళ్ల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

కుటుంబం

ఈ సంవత్సరం గురు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబ విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి వివాహం కానీ, సంతానం కానీ అవుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్థలు తొలగి పోతాయి. నూతన గృహ, వాహన యోగాలు ఈ సంవత్సరం సూచించ బడుతున్నాయి. మీ కుటుంబ సభ్యుల సహకారం, మిత్రుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. ద్వితీయార్థంలో గురు గోచారం అలాగే శని గోచారం అనుకూలంగా లేక పోవటం వలన కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశమున్నది. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. శని దృష్టి లగ్న స్థానం మీద పడుతుంది కాబట్టి అసహనాన్ని, కోపాన్ని అలాగే బద్దకాన్ని తగ్గించుకోవటం మంచిది. దాని వలన మీ కుటుంబ సభ్యులు బాధ పడే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ఈ సంవత్సరం ఉద్యోగం దొరికే అవకాశమున్నది. సంతానం కానీ వారికీ ఈ సంవత్సరం ప్రథమార్థం లో సంతానయోగం ఉంటుంది.

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించటమే కాకుండా, పలువురి ప్రశంసలు కూడా అందుకుంటారు. పరీక్షలలో అనుకున్న దాని కంటే ఎక్కువగా మార్కులు లేదా ర్యాంక్ రావటం జరుగుతుంది. అయితే శని గోచారం నాలుగవ ఇంట ఉండి లగ్నాన్ని చూడటం వలన అప్పుడప్పుడు చదువు మీద నిరాసక్తత, బద్ధకము పెరుగుతాయి. అలాగే చదువు పట్ల నిర్లక్ష్యము పెరుగుతుంది. ఎప్పటికప్పుడు చదువును రివ్యూ చేసుకుంటూ తప్పులను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళటం వలన చదువు విషయంలో ఇబ్బందులు ఎదురు కావు

పరిహారాలు.

ఈ సంవత్సరం ప్రధానంగా శనికి పరిహారాలు ఆచరించటం మంచిది. దాని వలన బద్ధకం తొలగి పోవటమే కాకుండా పని పట్ల శ్రద్ధ, పట్టుదల పెరుగుతాయి. దీనికి గాను శనికి పూజ లేదా జపం చేయటం మంచిది. అలాగే రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం కూడా మంచిది. అక్టోబర్ తర్వాత గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి గురు పూజ, జపం, స్తోత్ర పారాయణం చేయటం మంచిది.

No comments:

Post a Comment