Friday 6 April 2018

కుంభ రాశిఫలములు

కుంభ రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.
Kanya rashi telugu year predictions
ధనిష్టా 3, 4 పాదాలు (గు, గె)
శతభిషం 4 పాదాలు (గొ, స, సి, సు)
పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు (సె, సో, ద)
ఈ సంవత్సరం కుంభ రాశి వారికి అక్టోబర్ వరకు గురువు తొమ్మిదవ ఇంట ఉంటాడు. ఆ తర్వాత పడవ ఇంట సంచరిస్తాడు. శని సంవత్సరమంతా లాభ స్థానంలో, ధనూ రాశిలో సంచరిస్తాడు. రాహువు కర్కాటక రాశిలో, ఆరవ ఇంట, కేతువు మకర రాశిలో పన్నెండవ ఇంట వత్సరాంతం సంచరిస్తారు.

ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది

ఈ విలంబ (విలంబి) నామ సంవత్సరం మీకు చాల అనుకూలంగా, శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి, ఆర్థిక స్థితి మెరుగుపడటం, సమస్యలు తొలగి పోవటం మొదలైన శుభఫలితాలు ఉంటాయి. అయితే పన్నెండవ ఇంట కేతు గోచారం కారణంగా ప్రతి దానికి భయపడటం, ఏ పని చేయాలన్న ఎక్కడ విఫలం అవుతుందన్న భయంతో అసలు ప్రారంభించకుండా ఉండటం వలన కొన్ని సార్లు అవకాశాలు వచ్చినప్పటికీ చేజార్చుకుంటారు. ప్రధాన గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం మీకు అన్ని విషయాల్లో కలిసి వస్తుంది.

ఆరోగ్యం

ఈ సంవత్సరం గురువు, రాహువు మరియు శని అనుకూల గోచారం ఉండటం వలన ఆరోగ్య సమస్యలు పెద్దగా మిమ్మల్ని బాధించవు. శారీరకంగా ఆరోగ్యంతో ఉంటారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అయితే కేతు గోచారం పన్నెండవ ఇంట ఉండటం వలన మానసికంగా కొంత ఆందోళనకు గురవుతుంటారు. అలాగే నిద్రలేమితో బాధ పడతారు. లేని సమస్యలను ఊహించుకొని బాధపడటం, మీ మీద మీకు నమ్మకం సన్నగిల్లటం జరుగుతుంది. అయితే మిగతా గ్రహాల అనుకూల ప్రభావం ఉండటం వలన ఈ సమస్యలు పెద్దగా బాధించవు.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం ఉద్యోగస్థులకు చాల అనుకూలంగా ఉంటుంది. కారక గ్రహమైన శని లాభ స్థానంలో సంచరించటం, గురు రాహువుల అనుకూల గోచారం కారణంగా ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతి లేదా స్థాన చలనం కోరుకుంటున్న వారికి అక్టోబర్ నుంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. మీరు కోరుకున్న పదవి దక్కటం కానీ, కోరుకున్న చోటికి బదిలీ అవటం కానీ జరుగుతుంది. అయితే ఆరవ ఇంట రాహువు కొంత అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని ఇస్తాడు. దాని కారణంగా మీ సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావటం కానీ, అనవసరమైన సమస్యలు రావటం కానీ జరగవచ్చు. అలాగే ప్రతి దానికి గొప్పలు చెప్పుకునే స్వభావం కూడా అలవడే అవకాశమున్నది. మీ ప్రవర్తన పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. దాని కారణంగా వత్సరాంతంలో చెడు పేరు వచ్చే అవకాశముంటుంది.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాల అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ప్రజల నమ్మకాన్ని చూరగొంటారు. దాని కారణంగా మీ వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ సంవత్సరం మంచి లాభాలను ఇస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకునే వారికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ వరకు గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం, నూతన వ్యాపారం ప్రారంభించటం, కొత్త ఒప్పందాలు చేసుకోవటం మంచిది.
ఆర్థికంగా ఈ సంవత్సరం చాల అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు రావటం, ఖర్చులు తగ్గటం వలన డబ్బు నిలకడ పెరుగుతుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యయ స్థానంలో కేతు గోచారం కారణంగా మీ తొందరపాటు వలన కొంత డబ్బు నష్టపోయే అవకాశం కనిపిస్తున్నది. ఖర్చుల విషయంలో, కొనుగోళ్ల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం.

కుటుంబం

ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం చాల అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు, నమ్మకం పెరగటం అలాగే ఇంట్లో శుభ కార్యాలు జరగటం వలన కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న మనస్పర్థలు కానీ, సమస్యలు కానీ తొలగి పోతాయి. వివాహం లేదా సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ తోబుట్టువుల సహాయ సహకారాలు మీకు ఉంటాయి. వారి కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకూల పరిణామాలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విదేశీయానం చేయటం కానీ, వినోద యాత్రలు చేయటం కానీ చేస్తారు. వ్యయ స్థానంలో కేతు గోచారం కారణంగా మీ కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడు ఏదో ఒక చింత మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అనవసర భయాలను వీడనాడి మీ కుటుంబ సభ్యులతో ఈ సంవత్సరాన్ని హాయిగా గడపండి.

చదువు

ఈ సంవత్సరం విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. చదువులో బాగా రాణించటమే కాకుండా ప్రశంసలు, అవార్డులు కూడా అందుకుంటారు. పన్నెండవ ఇంటిలో కేతు సంచారం కారణంగా కొంత భయం, సంకోచం కలిగి ఉంటారు. దీని కారణంగా కొత్త విషయాలు నేర్చుకోవటం కొంత నిరాసక్తత భయం కలిగి ఉంటారు. తల్లిదండ్రులు వారి భయాన్ని పోగొట్టి సరైన మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది.

పరిహారాలు

ఈ సంవత్సరం ప్రధానంగా కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. కేతు మంత్రం జపం కానీ, స్తోత్ర పారాయణం కాని చేయటం లేదా గణపతి పూజ స్తోత్ర పారాయణం చేయటం వలన ఆటంకాలు తొలగిపోతాయి

No comments:

Post a Comment