Friday 2 June 2017

పంచాంగం

పంచాంగము అనగా ఐదు అంగములు కలది.

 అవి 1. తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4. యోగము, 5. కరణము.
ఆయనములు, పక్షములు
పంచాంగములు : 5
ఋతువులు : 6
వారములు : 7
దిక్కులు : 8
నవగ్రహములు 9
కరణములు : 11
మాసములు : 12
1. తిధి: ప్రతి రోజు సూర్యుడు 1అంశ (1డిగ్రీ) చంద్రుడు 13 అంశలు ముందుకు నడుస్తారు. అంటే వారిరువురి భ్రమణములోగల అంతరము 12డిగ్రీలు. (సూర్యుని భ్రమణమును సాపేక్ష భ్రమణము అంటారు. నిజానికి తిరిగేది భూమి. కాని మనము భూమిపై నిలబడి ఖగోళమును గమనించెదము కావున సూర్యునిది సాపేక్ష భ్రమణము.) ఈ 12 డిగ్రీల అంతరమును తిధి అంటారు.
మొదటి రోజు 12 డిగ్రీలు ఐతే రెండవ రోజు 24 డిగ్రీలు ఇట్లు 180 డిగ్రీలు చంద్రుడు సుర్యునినుండి జరిగినపుడు పౌర్ణమి, తిరిగి సూర్యుని చేరినపుడు (360 డిగ్రీలు లేక ౦ డిగ్రీ) వరకు కృష్ణ పక్షమని ఈ చంద్రయానమునంటారు. ఒక సౌర దినము = 0.9483 చంద్ర తిధి. ఈ విధంగా ఒక చంద్రమానమునకు 29.53 రోజులుంటాయి.
2. వారము: “అర్క శుక్ర బుధశ్చంద్రః మందో జీవ కుజః పుమాన్ స్వార్ధ ద్వి ఘటికా హోరాః ఇత్యే తత్ హోర లక్షణం”
అన్నది జ్యోతిష శాస్త్రము. 2½ ఘడియల కాలము = 1హోర(hour). మొదటి హోర అర్క అంటే సూర్యుడు అంటే ఆదిత్యుడు. మొదటి హోరతో మొదలయ్యే రోజు కావున మొదటి వారము ఆదివారమైనది. ఒక రోజుకు 24 హోరలు. అర్క తో మొదలుపెట్టి ఎంచితే 24 హోరల తో ఆ దినము పుర్తియౌతుంది. 25 వ హోర చంద్ర హోర అంటే సోమవారము. ఈ ప్రకారముగా వరుసగా 7 వారాలు వస్తాయి. మన హోర నే పాశ్చాత్యులు hour గ ఉచ్చరించినారు. ఈ వారముల క్రమము ఈ విధముగా ఏర్పడినదని పాశ్చాత్యుల కెరుకలేదు. కాని ఈ వారముల క్రమమును యధా తధముగా తమ భాషలోనికి పేర్లను గూడా తర్జుమా చేసుకొని వాడుకొనుచున్నారు.
౩. నక్షత్రము: సాపేక్ష సౌర గమనమునకు ఒక ఏడాది కాలము పడితే, ఆ పథంలో ఆయనకు 12 మజితీలను గుర్తించి(ఈ
మజితీలను రాశులు అంటారు) ఆయన ప్రయాణాన్ని 27ప్రాంతాలు (నక్షత్రాలు) చుట్టునట్లు విభజించినారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు. 4+4+1 పాదము కలిస్తే ఒక రాశి. ౩వ నక్షత్రములోని మిగిలిన ౩ పాదములు నాల్గవ నక్షత్రములోని 4 పాదములు 5 వ నక్షత్రములోని 2 పాదములు కలిస్తే 2 వ రాశి. అంటే (౩+4+2=9) ఇది రెండవ రాశి. ఇట్లు 9 పాదములతో ప్రతి రాశి ఏర్పడుతుంది. 12*9=108 అంటే 27 నక్షత్రములలోని 4+4 .. .. .. పాదములను కలిపితే 27*4=108 పాదములగును. మానవుని పేర్లు ఈ 108 పాదములలో (ఆడ గాని, మగ గాని) ఏదో ఒక దానికి చెందును గాన అందరు సుఖంగా ఉండాలనే అష్ట్తోతర శత నామార్చన (108 పేర్లు) దేవునికి చేస్తారు. నక్షత్రముల పేర్లు రాశుల పేర్లు ఈ క్రింద పొందు పరచబడినవి
1.అశ్వని, 2.భరణి, ౩.కృత్తిక, 4.రోహిణి, 5.మృగశిర, 6.ఆర్ద్ర, 7.పునర్వసు, 8.పుష్యమి, 9.ఆశ్లేష, 10.మఖ, 11.పుబ్బ, 12.ఉత్తర, 13.హస్త, 14.చిత్త, 15.స్వాతి, 16.విశాఖ, 17.అనురాధ, 18.జేష్ఠ, 19.మూల, 20.పూర్వాషాఢ, 21.ఉత్తరాషాఢ, 22.శ్రవణం, 23.ధనిష్ఠ, 24.శతభిషం, 25.పూర్వాభాద్ర, 26.ఉత్తరాభాద్ర, 27.రేవతి.
12 రాశుల పేర్లు : 1.మేషం(Aries), 2.వృషభం(Taurus), 3.మిథునం(Jamini), 4.కర్కాటకం(Cancer), 5.సింహం(Leo), 6.కన్య(Virgo), 7.తుల(Libra), 8.వృశ్చికం(Scorpio), 9.ధనుస్సు(Sagitarius), 10.మకరం(Capricorn), 11.కుంభం(Acquarious), 12.మీనం(Pisces). ఈ సంస్కృత రాశుల పేర్లకు లాటిన్ ప్రతి నామాలు బ్రాకెట్లో ఇవ్వబడినవి. గ్రీకు, బాబిలోనియన్ ఇత్యాది భాషలలో కుడా రాశులకు వారు వారుపయోగించిన పేర్లు ఇంచుమించుగా ఇవే సంస్కృతార్ధములు కలిగియున్నవి.
4.యోగము: యోగమంటే కలయిక. దైనిక చంద్ర గతి, సాపేక్ష సూర్య గతి కలిపితే (13.20’) యోగమంటారు. ఈ యోగములు 27. అవి: 1.విష్కంభము, 2.ప్రీతి, 3.ఆయుష్మాన్, 4.సౌభాగ్య, 5.శోభన, 6.అతిగండ, 7.సుకర్మ , 8.ధృతి, 9.శూల, 10.గంధ, 11.వృద్ధి,12.ధృవ, 13.వ్యాఘాత, 14.హర్షణ, 15.వజ, 16.సిద్ధి, 17.వ్యతిపాత, 18వరియన్ (వరిష్ట), 19.పరిఘ, 20.శివ, 21.సిద్ధ, 22.సాధ్య, 23.శుభ, 24.శుక్ల, 25.బ్రహ్మ, 26.ఇంద్ర, 27.నైద్రుతి. ఈ యోగము ప్రభావము మానవ శరీరము ఆరోగ్యముపైనుం టంది.
5.కరణము: చంద్రుడు రోజుకు 12 డిగ్రీల వంతున సుర్యునినుండి దూరమౌతూ వస్తాడు. పాడ్యమికి 12 దిగ్రీలయితే విదియకు 24 డిగ్రీలు ఆ ప్రకారంగా 180 డిగ్రీలకు పున్నమి, 360(౦) డిగ్రీలకు అమావాస్య అని తెలుసుకొన్నాము. అర్ధ తిధిని కరణము అంటారు (అంటే 12/2=6) అంటే ఏ అర్ధ తిధియైన 6 చేత నిశ్శేషముగా భాగింపబడుతుంది. ఈ కరణములు 11 అవి: 1.భవ, 2.బాలవ, 3.కౌలవ, 4.తైతుల, 5.ఖర జి, 6.వణిజి,7.విష్టి, 8.చతుష్పద, 93శకుని, 10.నగ, 11.కింస్తుఘ్నము. మొదటి 7 ఒక చంద్ర మాసములో 8 మార్లు వస్తాయి. అంటే 28 రోజులు. చివరి 4 కరణములు వరుసగాను స్థిరముగాను వస్తాయి. సూర్య చంద్ర భూ చలనములను ఇంత నిశితముగా పరిశీలించి గ్రహచారములనధ్యయనముచేసి భూమి పై వాని ప్రభావమును గూర్చి తెలిపినదీప్రపంచములో ఈ దేశము తప్ప వేరు దేశము లేదంటే అతిశయోక్తి కాదు.
పంచ అంగముల తరువాత మాసములను గూర్చి ముచ్చటిద్దాము. చంద్రుడు తన గమనమున పౌర్ణమి రోజు ఏ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నాడో ఆ నక్షత్రము పేరుతో ఆ మాసము ఏర్పడింది. అంటే పున్నమి రోజున చిత్ర నక్షత్రము వద్దకొస్తే చైత్ర మాసము, విశాఖ నక్షత్రము వద్దకొస్తే వైశాఖ మాసము ఆ ప్రకారంగా 12 మాసములు ఏర్పడినవి కాని నిరర్ధకమైన పేర్లను ఉపయోగించలేదు. ఈ 12 మాసముల పేర్లు ఈ దిగువన ఇవ్వబడినవి
1.చైత్రము, 2.వైశాఖము, 3.జ్యేష్టము, 4.ఆషాఢము, 5.శ్రావణము, 6.భాద్రపదము, 7.ఆశ్వయుజము, 8.కార్తీకము, 9.మార్గశిరము, 10.పుష్యము, 11.మాఘము, 12.పాల్గుణము

No comments:

Post a Comment